Sunday, January 19, 2025
HomeTrending Newsమత్స్యకారుల సంక్షేమమే మా ఉద్దేశం: మోపిదేవి

మత్స్యకారుల సంక్షేమమే మా ఉద్దేశం: మోపిదేవి

మత్స్యకారులకు ఏటా 15 రూపాయల పైబడి ఆదాయం అందించే ఉద్దేశంతోనే జీవో 217 రూపొందించామని, అది కూడా పైలెట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. వంద హెక్టార్ల (250 ఎకరాలు) పైబడి ఉన్న చెరువులను లీజుకు ఇచ్చి వాటి  నుంచి వచ్చే ఆదాయం ద్వారా మత్స్యకార సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న నిరుపేద మత్స్యకారులకు ఏటా కనీసం 15 వేల రూపాయలు అందేలా ఈ జీవోలో పేర్కొన్నామని వివరించారు.

విపక్ష నేతలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా ఈ జీవోపై దుష్ప్రచారం చేస్తున్నారని మోపిదేవి విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకార సంఘాల నేతలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళితే అయన వారిని తీవ్ర పదజాలంతో దూషించారని,  సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, అప్పుడు ఈ నాయకులంతా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

సిఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారం 2 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచిందని, డీజిల్ సబ్సిడీ నిధులు వెంటనే అకౌంట్లలో జమ చేస్తున్నామని తెలిపారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోయిన వారికి ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచామని, ఈ రెండున్నర ఏళ్ళలో 64 మందికి ఈ మొత్తాన్ని వెనువెంటనే అందించామని వివరించారు.  ఆక్వా కల్చర్ మీద ఆధారపడి జీవిస్తున్న 60 వేల మందికి పవర్ టారిఫ్ సబ్సిడీ ద్వారా ఏటా 700కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం మొదలైందని మోపిదేవి చెప్పారు.  పశ్చిమగోదావరి జిల్లాలో మెరైన్ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నమన్నారు.

ఆక్రమణలకు గురవుతున్న పెద్ద చెరువులను వేలంపాట ద్వారా లీజుకు ఇచ్చి, వాటి ద్వారా వచ్చే నిధులతో  నిరుపేదలైన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నేరాలు, ఘోరాలు జరిగిపోయినట్లు మాట్లాడడం సరికాదని విపక్షాలకు మోపిదేవి హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్