ఐపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 200 పరుగులు చేసినప్పటికీ లక్ష్యాన్ని ముంబై మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కామెరూన్ గ్రీన్ 47బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు, 20 పరుగుల వద్ద తొలి వికెట్ (ఇషాన్ కిషన్-14) కోల్పోయిన ముంబై రెండో వికెట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ- గ్రీన్ లు 128 పరుగులు జోడించారు. రోహిత్ 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 56 పరుగులు చేసి వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో భువి, మయాంక్ దగర్ చెరో వికెట్ పడగొట్టారు.
అయితే ముంబై ప్లే ఆఫ్స్ కు చేరేదీ లేనిదీ గుజరాత్-బెంగుళూరు మధ్య జరగబోయే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.
అంతకుముందు హైదరాబాద్ దాటిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టి తొలి వికెట్ కు 140 పరుగులు చేసింది. వివ్రాంత్ శర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 69;ప మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి ఔటయ్యారు. క్లాసేన్-18; ఏడెన్ మార్ క్రమ్-13(నాటౌట్) రన్స్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్(1); హ్యారీ బ్రూక్ (డకౌట్) లు విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరి బంతిని మార్ క్రమ్ స్టాండ్స్ లోకి పంపడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 200 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా, మరో వికెట్ జోర్డాన్ కు దక్కింది.
కామెరూన్ గ్రీన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.