భారీ వర్షాలతో మహారాష్ట్ర రాజధాని ముంబై తడిసిముద్దవుతోంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్‌లోనూ కుండపోతతో జనజీవనం అస్తవ్యస్ధమైంది. ఇక ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే కంషెట్ టన్నెల్ వద్ద గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైవే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని శిధిలాలను తొలగిస్తున్నారు.
ముంబైలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొరుగున థానే, రాయ్‌గఢ్ జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది. శుక్రవారం ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) యల్లో అలర్ట్ జారీ చేసింది.
ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని బీఎంసీ అధికారులు హెచ్చరించారు. మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది.