Birthday gift to Rohith: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఊరట విజయం దక్కింది. వరుసగా ఎనిమిది మ్యాచ్ లలో ఓటమి పాలైన ఆ జట్టు నేడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నేడు రోహిత్ శర్మ పుట్టిన రోజున ఈ విజయం దక్కడం విశేషం. రాజస్థాన్ విసిరిన 159 పరుగుల లక్ష్యాన్ని మరో బంతులు 4 మిలిగి ఉండగానే ముంబై ఛేదించింది. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ… చివర్లో డేవిడ్ మిల్లర్, పోలార్డ్ రాణించి జట్టుకు తొలి విజయం అందించారు. టిమ్ డేవిడ్ 9 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తో అజేయమైన 20 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి ఆరుపరుగులు కావాల్సిన దశలో పోలార్డ్ తొలి బంతికి ఔటయ్యాడు, ఆ తర్వాత వచ్చిన డేవిడ్ శామ్స్ రెండో బంతిని సిక్సర్ గా మలిచి మ్యాచ్ ముగించాడు.
నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ 26 పరుగుల వద్ద తొలి వికెట్ (పడిక్కల్-15), 54 వద్ద రెండో వికెట్ (కెప్టెన్ సంజూ శామ్సన్-16) కోల్పోయింది. డెరిల్ మిచెల్ కూడా 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. జోస్ బట్లర్ తన తీరుకు భిన్నంగా మెల్లగా ఆడాడు. అయితే హృతిక్ షోకీన్ వేసిన 16వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టిన బట్లర్ చివరి బంతికి ఔటయ్యాడు. బట్లర్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 21 పరుగులు చేయడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో షోకీన్, మెరెడిత్ చెరో రెండు; డానియెల్ శామ్స్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ముంబై జట్టులో… కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా విఫలమై కేవలం రెండు పరుగులే చేసి జట్టు స్కోరు 23 వద్ద ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మలు మూడో వికెట్ కు81 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. యాదవ్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51; తిలక్ 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశారు, జట్టు స్కోరు 122 వద్ద ఇద్దరూ ఒకేసారి అవుట్ కావడంతో మళ్ళీ ముంబై విజయంపై అనుమానాలు కలిగాయి. అయితే పోలార్డ్, టిమ్ డేవిడ్ నిలబడి గెలిపించారు.
రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్, యజువేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ, కులదీప్ సేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
సూర్య కుమార్ యాదవ్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : పంజాబ్ పై లక్నో విజయం