హిందూ సంస్కృతిలో పెళ్లి ముహూర్తానికి, ఇతర సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ఎంత ఆధునికులైనా సరే, అన్నీ పధ్ధతి ప్రకారమే జరగాలని కోరుకునే రోజులివి. ఏది ఎందుకు జరుగుతుందో, ఏ మంత్రానికి అర్థం ఏమిటో తెలియకపోయినా నునుసిగ్గుల దోబూచులాటలతో అన్నీ పాటించే వధూవరులను చూస్తూనే ఉంటాం. అయితే ఎంత బాగా ఏర్పాట్లు చేసుకున్నా అనుకోని అవాంతరాలు ఎదురవడమూ అప్పుడప్పుడు జరుగుతుంది. అలాంటపుడు ఆదుకుని ఆదరించినవారు ఎవరైనా ఆపద్బాంధవులే. అందులోనూ మనకేమాత్రం సంబంధం లేని ఇతర మతస్తులు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తే, ఆ ఆనందమే వేరు. ఇటువంటి సంఘటనలు భారత దేశం లోనే జరుగుతాయి. దేశ లౌకికత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ అరుదైన సంఘటనకు వేదిక అయింది పూణే నగరం.
పూణే కి చెందిన సంస్కృతీ , నరేంద్ర వివాహం ఓపెన్ లాన్ లో చేసుకోవాలనుకున్నారు. సరిగ్గా ముహూర్తానికి ముందు హోరున వర్షం మొదలైంది. అతిథులంతా చెల్లాచెదురయ్యారు. గ్రౌండ్ అంతా నీరు నిలిచి అస్తవ్యస్తంగా తయారైంది. దాంతో పెద్దవాళ్ళు దగ్గరలోని హాలులో ముస్లిం రిసెప్షన్ వలీమా జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడికెళ్లారు. వివాహం జరగడానికి సహకరించమని అభ్యర్ధించారు. ఆనందంగా అంగీకరించారు ముస్లిం పెళ్ళివారు. దాంతో రిసెప్షన్ కోసం చేసిన అలంకరణ వద్దే నిర్విఘ్నంగా హిందూ వివాహం జరిగింది. మంగళాష్టకంతో సహా అన్ని తంతులూ సజావుగా జరిగాయి. గంటకు పైగా తమ స్టేజిని హిందూ వివాహానికి అప్పగించి ఆత్మీయ అతిధులయ్యారు ముస్లిం వధూవరులు మహీన్ – మొహసిన్, వారి కుటుంబాలు. ఆనక కొత్తజంటలిద్దరూ వేదికపైన ఫోటోలు తీసుకోడమే కాదు. అందరూ కలసి వివాహవిందు ఆరగించారు. వార్త చదువుతుంటేనే కడుపు నిండిపోతోంది కదా!ఇదీ మన భారతదేశం…
-కె.శోభ
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు