విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు బొత్సతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఇప్పటికీ మూడు రాజధానుల విధానానికే కట్టుబడి ఉందని, ఈ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో చర్చిస్తామని, ఒకవేళ విధానం మార్చుకుంటే ఆ విషయాన్ని తాము బహిరంగంగా చెబుతామని బొత్స వ్యాఖ్యానించారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి జరగాలన్న తమ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండబోదన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చారా లేదా అనేది ముఖ్యం కాదని, తమ పార్టీతో ప్రజలకు మంచి జరిగిందా లేదా అనేది చూడాలని బొత్స అన్నారు. మండలిలో ప్రజల గొంతుకగా నిలబడి కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ పోరాడతామని వెల్లడించారు.
తమ పార్టీ నేతలపై పెడుతున్న కేసులపై బొత్స స్పందించారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందేనని, కానీ ఎలాంటి తప్పూ చేయకపోయినా చేసినట్లు నిరూపించాలనుకుంటే జరిగే పరిణామాలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. తనపై ఎన్ని విచారణలైనా వేసుకోవచ్చని… భయపడే ప్రసక్తే లేదని… ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.