ఆహా 100 పర్సెంట్ తెలుగు ఒటీటీ మాధ్యమంగా తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ ప్రతి తెలుగువారి ఇంట్లో భాగమైంది. తెలుగు ఓటీటీల్లో ఇప్పటి వరకు ప్రసారమైన టాక్ షోస్ అన్నింటి రూల్స్ ను మార్చి రాసేలా సరికొత్త టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె’తో ఆహా మన ముందుకు రాబోతుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ టాక్ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.
బాప్ ఆప్ ఆల్ టాక్ షోస్‌గా ఇది నిలుస్తుందనడంలో సందేహమే లేదు. అన్‌స్టాపబుల్ ఎన్.బి.కెలో నందమూరి బాలకృష్ణ ఎవరికీ సాధ్యం కానీ తనదైన స్టైల్లో తెలుగు చిత్రసీమలోని అతి పెద్ద స్టార్స్ తో మనసు విప్పి మాట్లాడబోతున్నారు. ఈ సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను ఈ షో ద్వారా తెలియజేయబోతున్నారు. ఈ టాక్‌షోలో తొలి ఎపిసోడ్ ఆహాలో దీపావళి సందర్భంగా నవంబర్ 4 సాయంత్రం నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని బుధవారం బాలకృష్ణ, ‘ఆహా’ ఫేస్ బుక్ లైవ్ ద్వారా తెలియజేస్తూ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ప్రోమోను విడుదల చేశారు. ఈ షోకు సంబంధించి ప్రేక్షకులు ఎలాంటి అంచనాలతో అయితే ఎదురుచూస్తున్నారో అలాంటి ఈ ప్రోమోలో బాలకృష్ణ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన ఓ ఫ్యాన్సీ బైక్ నుంచి లగ్జరీ కారు, అక్కడి నుంచి గుర్రం పై స్వారీ చేస్తూ కనపడుతున్నారు. ఈ ప్రోమో చూస్తుంటే ఆయన తిరుగులేని ఎనర్జీతో ఈ షోను హోస్ట్ చేయబోతున్నారని అర్థమవుతుంది.
మాటల్లో ఫిల్టర్ ఉండదు. సరదాలో స్టాప్ ఉండదు. సై అంటే సై, నై అంటే నై….అంటూ తనదైన పంథా మాటలతో ఆయన ప్రోమోలో గర్జించారు. ఆయన ఎనర్జీ ఎలాగైతే తిరుగులేకుండా ఎవరూ ఆపలేని విధంగా అజేయంగా ఉంటుందో అన్‌స్టాపబుల్ విత్ ఎన్.బి.కె కూడా అంతే నిజాయతీగా, ఎనర్జిటిక్‌గా, రియల్, భావోద్వేగాలతో అనూహ్యంగా ఉండబోతోంది.