నాని కథానాయకుడిగా రూపొందిన ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. డీవీవీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, విలన్ గా ఎస్ జె సూర్య కనిపిస్తాడు. ప్రతి ఒక్కరికీ కోపమనేది వస్తూనే ఉంటుంది. అలాంటి కోపాన్ని తరచూ ప్రదర్శించకుండా, వారంలో ఒక రోజుకి దానిని కుదించుకోవడమనే కాన్సెప్ట్ తో ఈ సినిమా కొనసాగుతుంది. తెలుగు వరకూ ఇది కొత్త పాయింటే అనుకున్నారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ ఓపెవింగ్స్ ను రాబట్టింది. ఆ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించే దిశగా కనిపించింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే 5 రోజుల్లో ఈ సినిమా 75. 26 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరడమనేది నిజం కాబోతోంది. అయితే అది ఈ పాటికే జరగవలసిందనేది అభిమానుల అభిప్రాయం.
ఈ సినిమా మంచి వసూళ్లతో ముందుకు కదలడం మొదలుకాగానే ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో .. అటు ఆంధ్రప్రదేశ్ లో వానలు .. వరదలు మొదలయ్యాయి. జన జీవనం అస్తవ్యస్తం అయింది. అందువలన ఈ సినిమా వసూళ్లపై ఆ ప్రభావం పడింది. లేకపోతే ఈ పాటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి ఉండేదనేది అభిమానుల మాట. వసూళ్లు కాస్త ఆలస్యమైనా ఈ సినిమాతో నాని మరో హిట్ కొట్టాడనేది నిజం.