అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం, నిత్యావసర ధరలు పెంచారని,  పెన్షన్ పెంచడం మర్చి పోయారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీని గడగడలాడించి ప్రత్యేక హోదా తీసుకువస్తానన్న జగన్ ఇప్పుడు హోదా అంశమే మర్చిపోయారని విమర్శించారు. కనీసం రోడ్ల మరమ్మత్తులు చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని అయన వ్యాఖ్యానించారు.

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఇటీవలే అప్పారావు భార్య కోటమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోటలో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను లోకేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇబ్బందులు పెడుతున్నారని, తాము అధికారంలోకి రాగానే వీటికి బదులు తీర్చుకుంటామని లోకేష్ మరోసారి హెచ్చరించారు. ఈ బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని చెప్పారు.

ప్రభుత్వం ఆస్తి పన్ను, చెత్త పన్ను ఇలా అన్నిటిపై పెన్నులు పెంచుకుంటూ పోతోందని దుయ్యబట్టారు, ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇప్పటికే రెండున్నరేళ్ళు గడిచి పోయిందని, మరో రెండున్నర సంవత్సరాల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని లోకేష్ టిడిపి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. లోకేష్ వెంట మాజీ డిప్యుటీ సిఎం చినరాజప్ప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *