Sunday, February 23, 2025
HomeTrending Newsనిర్వాసితులకోసం పోరాటం : లోకేష్

నిర్వాసితులకోసం పోరాటం : లోకేష్

పోలవరం నిర్వాసితులకు కనీసం ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జూన్ 2020 నాటికి 18 వేల ఇళ్లు,  మే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తామని, నిర్వాసితులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రగల్భాలు పలికారని, కానీ ఇప్పటికి ఒక్క ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.

తూర్పుగోదావరి జిల్లా, కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులను లోకేష్ పరామర్శించారు. అనంతరం వారితో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుగుకున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న సహాయ పునరావాస కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

చంద్రబాబు కంటే ముందు ముగ్గురు ముఖ్యమంత్రులు పోలవరం ప్రాజెక్టుపై ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, చంద్రబాబు ఐదేళ్ళ పదవీ కాలంలో 11,537 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రతి సోమవారాన్ని పోలవారం గా మార్చి ప్రాజెక్టుపై నిరంతరం సమీక్షలు చేసి 72శాతం పనులు పూర్తి చేయించారని లోకేష్ వెల్లడించారు.  సిఎం జగన్ ఈ రెండేళ్ళలో కేవలం 850 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని, నాలుగు శాతం పనులే పూర్తి చేయగలిగారని లోకేష్ వివరించారు. సిఎం జగన్ తన తండ్రి వైఎస్ విగ్రహానికి రూ. 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి మాత్రం డబ్బులు లేవా అని లోకేష్ నిలదీశారు.  పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సుమారు 4 వేల కోట్ల రూపాయలు కూడా స్వాహా చేయడం దారుణమన్నారు. అందరం కలిసి కట్టుగా నిర్వాసితుల హక్కుల కోసం పోరాటం చేద్దామని లోకేష్ పిలుపు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యా రాణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్