Friday, May 31, 2024
HomeTrending Newsఆఫ్ఘన్ పరిణామాలపై ఉన్నత స్థాయి సమావేశం

ఆఫ్ఘన్ పరిణామాలపై ఉన్నత స్థాయి సమావేశం

ఆఫ్ఘనిస్తాన్లో క్షేత్ర స్థాయి పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఆఫ్ఘన్ లో తాలిబాన్ల విధానాలు, పంజ్ షిర్ లోయలో పరిణామాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ను ప్రధాని ఆదేశించారు. భారత్ కు వ్యతిరేకంగా తాలిబాన్ల కదలికలు, కాబుల్ లో మిగిలిపోయిన భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తీర్మానం తర్వాత తాలిబాన్ల స్పందన, రష్యా, చైనా దేశాల వైఖరిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ల వ్యవహారంలో కలిసి వచ్చే దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి విదేశాంగ శాఖను ఆదేశించారు. భారతీయుల తరలింపులో సహకరిస్తున్న తజికిస్తాన్ తో సమీక్ష చేస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

జమ్ముకాశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ సహా తూర్పు సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో భద్రత పటిష్టం చేసి, నిఘావర్గాలను అప్రమత్తం చేసినట్టు అజిత్ దోవల్ ప్రధానమంత్రికి వివరించారు. తాలిబన్లకు సహకరించి పాక్ ఆక్రమిత కశ్మీర్ కు తిరిగి వచ్చిన మోజహిద్దిన్ లు భారత దేశంలో అలజడి సృష్టించే అంశంపై సమావేశంలో చర్చించారు.

ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో ఇండియా అధ్యక్షతన ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై చర్చ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో చైనా,రష్యా లోపాయికారీ జోక్యంపై కూడా మండలి సమావేశంలో చర్చించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు శాంతికి సహకరించాలని, విదేశీయులకు ప్రాణహాని తలపెట్టకుండా, ఇతర దేశాలకు వెళ్ళే వారిని నిరోధించకూడదని సమావేశంలో తీర్మానం చేశారు.  13 సభ్య దేశాల్లో చైనా, రష్యా మినహా అన్ని దేశాలు భారత్ ప్రతిపాదించిన తీర్మానానికి ఆమోదం తెలిపాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్