Sunday, January 19, 2025
HomeTrending Newsప్రభుత్వ చర్యలు భేష్: జాతీయ ఎస్సీ కమిషన్

ప్రభుత్వ చర్యలు భేష్: జాతీయ ఎస్సీ కమిషన్

రాష్ట్రంలో ఎస్సీలు, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. ఇటీవల గుంటూరులో దారుణ హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థిణి ఎన్.రమ్య సంఘటనపై పరిశీలనకు వచ్చిన అయన మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ తదితర అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హల్దార్ మీడియాతో మాట్లాడుతూ రమ్య ఘటన చాలా తీవ్రమైందని, దీనిపై రాష్ట్ర  ప్రభుత్వం వేగంగా స్పందించి ప్రివెన్సన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్టు(పీవోఏ చట్టాన్ని) సక్రమంగా అమలు చేసిందని కొనియాడారు. బాధిత కుటుంబానికి సకాలంలో పరిహారాన్ని కూడా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించడమేగాక చార్జిషీటు కూడా ఫైల్ చేశారని ఇంత వేగంగా స్పందించడం పట్ల ఏపీ ప్రభుత్వం తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంఘటనపై పని చేసిన అధికారులకు అవార్డులకై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అరుణ్ హల్దార్ చెప్పారు. దేశం మొత్తం ఏపీ వ్యవహరించిన తీరును పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏపీ లో ఇతర కేసుల వ్యవహారం లోను ఇదే విధంగా స్పందించాలని కమిషన్ కోరుకుంటోందని తెలిపారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల సమీక్షకు ఏపీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం గురించి ప్రయత్నాలు చేస్తున్నామని అరుణ్ హల్దార్ చెప్పారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కులాల అభివృద్ధి సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. గుంటూరు సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన స్పందించి బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచిందని చెప్పారు. బాధితురాలి తల్లికి  ఎస్సి, ఎస్టి పిఓఏ నిబంధనల ప్రకారం 8లక్షల 25వేల రూ.ల పరిహారాన్ని అందించడం తోపాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 10లక్షల రూ.లు ముఖ్యమంత్రి సహాయనిధి కింద అందించిందని వెల్లడించారు. ఇంటిపట్టాను కూడా మంజూరు చేసి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా స్వంత ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని వివరించారు.దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు.

సమావేశంలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ ఈసంఘటన జరిగిన వెంటనే పోలీస్ యంత్రాంగం యుధ్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి అన్ని ఆధారాలు సేకరించి కేసు వేగవంతం చేసి చార్జిషీటును ఫైల్ చేసిందని వివరించారు. రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకుని వచ్చి మహిళలు భద్రతకు అన్ని విధాలా భరోసా కల్పించడం జరుగుతోందని చెప్పారు. దిశ యాప్ ను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేయడంతో రాష్ట్రానికి 5 జాతీయ అవార్డులు వచ్చాయని డిజిపి గౌతం సవాంగ్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జాతీయ ఎస్సి కమీషన్ సభ్యులు డా.అంజు బాల, సుభాష్ ఫర్ది, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ హర్ష వర్ధన్, పోలీస్ శాఖ డిఐజిలు రాజకుమారి, పాల్ రాజు, గుంటూరు జిల్లా రూరల్ అండ్ అర్బన్ ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్