Nato Meeting : రష్యా ఉక్రెయిన్ యుద్ధం నానాటికి తీవ్రం కావటం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. రెండు దేశాలు పోరు నుంచి వెనక్కి తగ్గక పోవటంతో అంతర్జాతీయంగా వ్యాపార వాణిజ్య వర్గాలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే మూడో ప్రపంచ దేశాల్లో పెట్రో ఉత్పత్తులు, వంట నూనెల ధరలు ఉహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24 వ తేదిన బ్రస్సెల్స్ లో నాటో(North Atlantic Treaty Oraganisation) కూటమి సమావేశం అవుతోంది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరు కానున్నారని శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. నాటో సమావేశంతో పాటు యురోపియన్ యూనియన్ సమావేశంలో కూడా జో బిడెన్ పాల్గొంటారు.
నాటో సమావేశంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధ విరమణకు మార్గాలు అన్వేశించనున్నారు. సంప్రదింపుల ద్వారానే యుద్ధ విరమణ సాధ్యమని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో ప్రపంచ దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. రష్యా యుద్ధ విరమణ చేయకపోతే ఈ దఫా అమెరికా, నాటో కూటమి తీవ్ర చర్యలు తీసుకునే దిశగా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ యూరోప్ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సకి పేర్కొన్నారు. బ్రస్సెల్స్ లో నాటో సమావేశం తర్వాత పోలాండ్ వెళ్లి అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద్మీర్ జేలేన్సకీని కలిసే అవకాశం ఉందన్నారు. అయితే బిడెన్ యూరోప్ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యాక ఇది ఫైనల్ అవుతుందని శ్వేత సౌధం స్పష్టం చేసింది.
Also Read : ఉక్రెయిన్ తో ఆగదు… యుద్ధం ప్రపంచాన్ని తాకుతుంది