బలవుతున్న బాల్యం

Instant life – affect on Children:
ప్రతి ఒక్కరికీ బాల్యం ఒక తీపి జ్ఞాపకం
అమ్మచేత్తో తిన్న గోరుముద్దలు
నాన్న తెచ్చే చిరుతిళ్ళ కోసం ఎదురుచూపులు
బామ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలకు ఊ కొడుతూ నిద్రపోయే రాత్రులు…
పక్కింట్లో ఉన్న జామ, నేరేడు, మామిడి, సీమచింత చెట్లెక్కి దొంగచాటుగా కాయలు తెంపి పారిపోవడాలు…
చెరువుల్లో, దిగుడు బావుల్లో, పిల్ల కాలువల్లో ఈతలు…
పొలం గట్లపై, సందుల్లో, గొందుల్లో పరుగు పందాలు…
అమ్మ వద్దని వారిస్తున్నా వానలో తడవడాలు…
వాననీళ్ళలో వదిలే కాగితపు పడవలు…


ఆడపిల్ల అమ్మలా, మగపిల్లవాడు నాన్నలా నటిస్తూ ఆడే అమ్మానాన్న ఆటలు….
అష్టాచెమ్మ, దాడి, వైకుంఠపాళి, గుజ్జన గూళ్ళు, ఇసుక ఇళ్ళు, గోటి-బిళ్ల, గోలీలు, ఏడు పెంకులు, కోతిక్కొమ్మచ్చి, కప్పగంతులు, ఉప్పుబస్తా, ఎంతెంత దూరం, తాడు ట్రైన్లు, తూగుటుయ్యాలలు….
ఇసుకలో చుకుచుకు పుల్ల, అవ్వా అప్పచ్చి, దాగుడు మూతలు, బచ్చాలాట, కబడ్డీ, ఇలా రకరకాల ఆటలతో కాలక్షేపం.

కొత్తగా పరిచయం అవుతున్న ప్రపంచం… ఎన్నో అర్ధం కాని విషయాలు.. అనేక ప్రశ్నలు.. అన్నిటికి ఓపిక గా సమాధానాలు చెప్పే పిన్ని-బాబాయిలు, అత్త-మామలు, బామ్మ- తాతలు, అమ్మమ్మలు….
ఒకప్పుడు బాల్యం అలా ఆనందంగా గడిచేది.

ఇప్పుడు కాలం మారింది.
ఈతరం పిల్లలకు అటువంటి ఆటలు లేవు, ఆనందాలు లేవు.
దీనితో బాల్యం చాలా ఒత్తిడికి గురవుతోంది
ఉమ్మడి కుటుంబాలు లేవు..
పిల్లలను పట్టించుకొనే సమయం తల్లితండ్రులకు ఉండడం లేదు.
వారితో మనసు విప్పి మాట్లాడి ప్రేమను పంచే ఓపిక అసలే లేదు.
అమ్మ చూసే టీవీ సీరియళ్ళకు అడ్డమొస్తే విసుగు. నాన్నను ప్రశ్నిస్తే కోపం.
పిల్లలతో మాట్లాడటానికి, కధలు చెప్పడానికి తాతలు, అమ్మమ్మలు, బామ్మలు వాళ్ళతో ఉండరు.
పిల్లలకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నామనే భ్రమలోనే తల్లితండ్రులు బతుకుతున్నారు
కానీ ఈ సౌకర్యాల మాటున దాగిన ఒంటరితనం… దాన్ని దూరం చేసే ఆలోచన, ఓపిక తల్లిదండ్రులకు ఉండడం లేదు
చదువు.. చదువు, మార్కులు, ర్యాంక్ లు, ట్యూషన్ లు, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ లు .. నిరంతరం ఉరుకులు, పరుగులు….
తోటి పిల్లలతో పోలికలు..
పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి….
చుట్టూ మనుషులు.. కానీ మానసిక ఒంటరితనం..
కోపం, అసహనం, అభద్రత, నిరాశ, నిస్పృహ.. వెరసి బాల్యంలోనే జీవితాన్ని ముగించుకొంటున్నారు. అదీ బలవంతంగా.


కేంద్ర నేర రికార్డుల బ్యూరో వారి లెక్కల ప్రకారం 2020సం.లో మనదేశంలో సగటున రోజుకు 31 మంది పిల్లలు, అంటే 18 సంవత్సరాల వయస్సులోపు వారు ఆత్మహత్య చేసుకున్నారు.
2018 లో 9413 మంది,
2019 లో 9613 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొంటే
2020 లో ఈ సంఖ్య 11,396 కు పెరిగింది

ఇక పిల్లలు ఈ బలవంతపు మరణాలకు పాల్పడడానికి కారణాలలో మొదటి కారణం కుటుంబ సమస్యలైతే, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్య కారణాలు, ఇటీవలి కరోనా… ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సర్వేలు వెల్లడించాయి.
బాల్యం అంటే హాయిగా ఆడుతూ, పాడుతూ, చదువుకొంటూ తిరగాల్సిన వయస్సులో “ఇక బ్రతకటం మా వల్ల కాదంటూ” తమ బ్రతుకును తామే ఇలా అర్ధాంతరంగా ముగించుకొంటున్నారంటే.. దీనిపై తల్లిదండ్రులంతా తప్పకుండా ఆలోచన చేయాలి.

నూనూగు మీసాల నూత్న యవ్వనంలో చెలరేగే సునిశిత భావోద్వేగాలకు వక్రభాష్యం చెప్పి యువత మనసులను కలత పెడుతున్న “చలన చిత్రాలు, టెలివిజన్ సీరియళ్ళు”…. ప్రేమ విఫలమైతే ‘చంపాలి లేదా నేనే చచ్చిపోవాలి’ అనే ఉన్మాదస్థితికి తీసుకు వెళ్తున్నాయి.
ఈ ఆత్మహత్యలకు ఇంకా సవాలక్ష కారణాలు ఉండొచ్చు.
కానీ జీవన ఎదుగుదల క్రమంలోనే “బాల్యం” ఇన్ని ఒడిదుడుకులకు గురి అవ్వడంలో మనిషి బాధ్యత, సమాజం బాధ్యత లేదా?
ఈ మనిషిలో మార్పు వస్తుందా?
ఈ సమాజంలో మార్పు వస్తుందా?

“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం…”

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read :

రాజీ మార్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *