జావెలిన్ త్రో లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో స్వర్ణం గెల్చుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా తన పేరిట రికార్డు నెలకొల్పాడు.
టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ ఆ మరుసటి ఏడాది 2022లో అమెరికా లోని ఒరెగాన్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ లో జరిగిన పోటీల్లో రజతం దక్కించుకున్నాడు. ఆ వెంటనే జ్యూరిచ్ లో జరిగిన డైమండ్ లీగ్ లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
బుడాపెస్ట్ లో జరుగుతోన్న పోటీల్లో నేడు జరిగిన ఫైనల్స్ లో నీరజ్ 88.17 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజతం, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ 86.87 మీటర్లతో కాంస్యం గెల్చుకున్నారు.
గత ఏడాది తృటిలో స్వర్ణం చేజార్చుకున్న నీరజ్ తాజా పోటీల్లో దాన్ని సాధించి మరోసారి తన సత్తా చాటాడు.