Thursday, November 21, 2024
HomeTrending Newsకేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు మొండి చేయి

కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు మొండి చేయి

తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యులు రుబాయిల్లో చెప్పినట్టుగా  వస్తాడని నేదల్చితి – వాడెక్కడనో… ముస్తాబును జేసికొంటి – ముద్దివ్వడనో అన్నట్టుగా ఉంది కేంద్ర బడ్జెట్. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపిలు ఉన్న రాష్ట్రానికి వరాలు ప్రకటిస్తారు అనుకుంటే ఉసురుమనిపించారు.

ఆర్థిక మంత్రి నిర్మల సితారామన్ బడ్జెట్‌ లో తెలంగాణకు మొండి చేయి మిగిలింది. బడ్జెట్లో హైదరాబాద్‌ – బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఒకటే అంశం ప్రస్తావించారు. ఈ కారిడార్‌ కు ఆర్థిక తోడ్పాటునందిస్తామని వెల్లడించారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు ఆర్థిక సాయం ప్రకటించలేదు.

రేవంత్‌ రెడ్డి సీఎం అయిన కొత్తలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని గొప్పగా చెప్పినా ఆ ప్రాజెక్టును కనీసం ఏఐబీపీ స్కీంలో కూడా పరిగణలోకి తీసుకోలేదు. తెలంగాణకు ఒక్క కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి సాధించింది ఏమీ లేదు. సిరిసిల్లకు మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌, వరంగల్‌ టెక్స్‌ టైల్‌ పార్క్‌కు ఆర్థిక సాయం, తెలంగాణలోని ఇండస్ట్రియల్‌ కారిడార్లకు నిధుల ఊసు లేకుండా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

ఉత్తర తెలంగాణ జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌కు నిధుల ప్రస్తావన లేదు. ఖాజీపేట్ కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నవోదయ విద్యాలయాలు ,రైల్వే లైన్లు తదితర అంశాలను పట్టించుకోలేదు.

కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడ‌లేదని, గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా ఎండగట్టే వాళ్ళన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్