Saturday, January 18, 2025
HomeTrending Newsనేపాల్ ప్రధానిగా కేపి శర్మ ఓలి ... గిల్లికజ్జాలకు మారుపేరు

నేపాల్ ప్రధానిగా కేపి శర్మ ఓలి … గిల్లికజ్జాలకు మారుపేరు

నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి (కేపీ శర్మ ఓలీ) ఈ రోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 22 మంది మంత్రులు ప్రమాణం చేశారు. గతంలో భారత వ్యతిరేకత వెళ్ళగక్కిన 72 ఏళ్ళ వయసున్న ఓలి నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. పాలన వ్యవహారాల నుంచి పొరుగు దేశాల వరకు అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటారని ఓలిపై ఆరోపణలు ఉన్నాయి.

అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది. శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్‌ దహల్‌ ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 సీట్లు కావాల్సి ఉండగా.. ప్రచండకు అనుకూలంగా 63 సీట్లు మాత్రమే వచ్చాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా పడటంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.

ఓలి నేతృత్వంలోని సీపీఎన్‌-యూఎంఎల్‌, మరో మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సీ) కూటమి మధ్య కొన్ని రోజుల క్రితమే అధికారం పంచుకోవడంపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకూ దేవ్‌బా ప్రధానిగా కొనసాగుతారు.

నేపాల్లో చైనా రాయబారిగా ఉన్న 54 ఏళ్ళ హౌ యాంకీ(Hou Yanqi)- PM KP శర్మ ఓలీ మధ్య సంబంధాలపై అప్పట్లో అనేక పుకార్లు షికారు చేశాయి. రాయబారి ద్వారా చైనా పాలకులు హనీ-ట్రాపింగ్ యత్నాలు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ దౌత్యవేత్త – పీఎం ఓలీలపై వచ్చిన వార్తలు వాస్తవం కాదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.

2015లో నేపాల్ దిగ్బంధనం సమయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓలి కఠిన వైఖరి అవలంభించారు. భారతదేశంతో నేపాల్ సన్నిహిత వాణిజ్య సంబంధాలకు ప్రత్యామ్నాయంగా చైనాతో వాణిజ్యం బలోపేతం చేశాడు. భారతదేశంతో వివాదాస్పదమైన భూభాగాలతో సహా రాజ్యాంగ సవరణ ద్వారా నేపాల్ మ్యాప్‌ కొత్తది తీసుకొచ్చి వివాదాన్ని రాజేశాడు. ఈ వ్యవహారంలో స్వదేశంలో జాతీయవాదిగా ప్రశంసలు అందుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓలీ… ఆర్థిక వృద్ధి  సాధించటంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.

ఉత్తరాఖండ్‌ పితోర్‌గఢ్ జిల్లాలో ఇండియా-నేపాల్-చైనా ట్రైజంక్షన్ వద్ద లింపియాధుర, లిపులేఖ్, కాలాపానీలను కలిగి ఉన్న 372-చ.కి.మీ. ప్రాంతాలు తమకు చెందినవని ఓలి హయంలోనే వివాదం రాజుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన ఓలి… ఈ దఫా అయినా ఇండియాతో సత్సంబందాలకు యత్నిస్తారా చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్