Wednesday, February 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనెస్లే ఒప్పుకున్న అరవై శాతం అనారోగ్యం!

నెస్లే ఒప్పుకున్న అరవై శాతం అనారోగ్యం!

కొన్ని విషయాలు సీరియస్ గా చర్చించి ప్రయోజనం ఉండదు. నిజానికి సీరియస్ నెస్ అనే మాటకు ఉన్న గాంభీర్యం నిఘంటువుల్లో ఇంకా అలాగే ఉందేమో కానీ- బయట మనకు ఏదీ సీరియస్ కాదు. అలాంటి సీరియస్ అయినా సీరియస్ కాకుండా పోయిన అనేకానేక విషయాల్లో ఇదొకటి. కాబట్టి దయచేసి ఎవరూ దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు.

నెస్లే ప్రపంచ ప్రఖ్యాత ఆహార ఉత్పత్తుల కంపెని. స్విట్జర్లాండ్ లో మొదలై భూగోళమంతా విస్తరించిన అతి పెద్ద కంపెని. భారత దేశంలో వందేళ్లుగా చాకోలెట్లు, బిస్కట్లు, పాల పొడి, పానీయాలు…ఇలా రెడీ మేడ్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్న కంపెని.

పదేళ్ల కిందట నెస్లే నూడుల్స్ లో సీసం ఎక్కువయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. నెస్లే మొదట సీసమే లేదంది. తరువాత పరిమిత మోతాదులో సీసం ఉందని మన చెవుల్లో వాస్తవ అంగీకార సీసం పోసింది.

ప్రపంచవ్యాప్తంగా తాము తయారు చేస్తున్న పదార్థాల్లో అరవై శాతం ఆహార ఉత్పత్తులు ఆరోగ్య భద్రతా ప్రమాణాలకు లోబడి లేవని నెస్లేనే అంగీకరించింది. ధర్మం ఒంటికాలి మీద నడిచే ఈ కలియుగంలో నెస్లే తన ఉత్పత్తులు అనారోగ్యకారకం అని తానే ఒప్పుకున్నందుకు మొదట అరవై శాతం అభినందించాలి.

సిగరెట్టు పెట్టె మీద “తాగితే పురుగులు పడి పోతారు” అని చట్టబద్దమయిన హెచ్చరిక ముద్రిస్తున్నాం. ఊపిరి తిత్తుల్లో పురుగులకు పొమ్మనలేక పొగబెట్టడానికే తాగుతున్నామని తాగేవారి వాదన. అలా భవిష్యత్తులో నెస్లే కూడా నూడుల్స్ లో సీసం; బిస్కట్లో విషం, పాలపొడిలో సైనైడ్, కూల్ డ్రింక్ లో పాము కోరల కాలకూట విషం తగు పాళ్లల్లో ఉన్నాయని హెచ్చరికను ముద్రించుకుంటే సరి. తినేవారు తింటారు. తాగేవారు తాగుతారు. ఉండేవారు ఉంటారు. పోయేవారు పోతారు.

శతమానం భవతి – వేదకాలం నాటి ఆశీర్వచనం. వందేళ్లు బతుకు అని దాని ఉద్దేశం. రాను రాను అది కాలగతిని అనుసరించి అందులో ఉన్న సంఖ్య వందే అయినా- అరవై ఏళ్లకే బతుకు బండి గ్యారేజ్ లో మూలన పడుతోంది. వందేళ్ల నెస్లే ఇన్నేళ్లు ప్రయత్నిస్తే అరవై శాతం అనారోగ్యాన్ని ఎక్కించగలిగింది. శతమానం ఆచరణలో అరవై కావడానికి – వందేళ్ల నెస్లే అరవై శాతం అనారోగ్యాన్ని ఒప్పుకోవడానికి కార్యకారణ సంబంధమేదో కంటికి కనపడకుండా ఉండి ఉంటుంది. నిజానికి 35 శాతం మార్కులొస్తే మనం బతికి బట్టగట్టి బలుసాకు తిని బతకగలుగుతాం. నెస్లే ఇంకో అయిదు శాతం అనారోగ్యాన్ని ఎక్కించినా మన ప్రాణాలు పోకపోవచ్చు.

పున్నమినాగు సినిమాలో చుక్క చుక్క విషం అన్నంతో పాటు తిని బతకడం మనం చూడలేదా ఏమిటి?

నెస్లే కూడా అలాగే చుక్క చుక్క చక్కగా చిక్కగా ఎక్కించి ఉంటుంది. మనమిప్పుడు వందశాతం ఆరోగ్యకరమయిన ఆహారం తింటే శరీరం తట్టుకుని నిలబడగలదో లేదో పోషకాహార నిపుణులు తేల్చి చెప్పాల్సిన విషయం.

నెస్లే ఒప్పుకుంది. మిగతావారు ఒప్పుకోరు. ఒప్పుకోవాలని మనం కోరుకోవడం లేదు కూడా. తినగ తినగ విషము తియ్యగనుండు…అని ఎన్నెన్నో నెస్లేలు, నెస్లే తాతలను మన పొట్టలు జీర్ణం జీర్ణం విషాపి జీర్ణం అని అరాయించుకున్నాయి.

అన్నట్లు- తమ ఆహారోత్పత్తుల్లో అరవై శాతం అనారోగ్యమయినవాటిని ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా తగ్గిస్తూ…పూర్తి ఆరోగ్య ఆహారాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని నెస్లే ఉదారంగా ముందుకు వచ్చి ప్రకటించింది.

భవిష్యత్తు కల.
నేడు వల.
నిన్న విల విల..

నెస్లే అంగీకరించిన వందేళ్ల విషాన్ని మనం కూడా ఉదారంగా అంగీకరిద్దాం. అంగీకరించకపోతే మనచేత బలవంతంగా ఎలా అంగీకరింపచేయాలో నెస్లేకు బాగా తెలుసు. అరవై శాతం డ్యామేజ్ కంట్రోల్ కు నెస్లే ప్రపంచవ్యాప్తంగా ప్రకటనలను గుప్పించింది. భారత్ లో ప్రస్తుత డ్యామేజ్ కంట్రోల్ ప్రకటనల సారాంశమిది.
“కోట్లాది భారతీయుల జీవితంలో ఒక భాగం. ఒక శతాబ్దం నుండి మీ అచంచల విశ్వాసానికి పాత్రులం”

దీని అర్థం-
“వందేళ్లుగా ఏమి చేశామో – మరో వందేళ్లు అదే చేస్తాం. మాకు మరోలా చేతకాదు. మమ్మల్ను దోషులుగా నిలబెట్టడం మీకు చేతకాదు. కోట్లాది భారతీయులకు మా అనారోగ్యం ఒక భాగం” అని స్పష్టం.

కడుపుకు నెస్లే తిన్నది మనమే కాబట్టి- మన కడుపు చించుకుంటే మన కాళ్ల మీదే పడుతుంది. జీర్ణమంగే సుభాషితం అన్నది ఆవేదనా వాక్కు. వినేవారు లేక మంచిమాట నాలోనే జీర్ణమయిపోయిందని దీని అర్థం.
“జీర్ణమంగే నెస్లే ఆహారం”
అని వినేవారు లేక నెస్లే ఒప్పుకున్న అరవై శాతం అనారోగ్యం మన కడుపులోనే విషంగా ఉండిపోతుంది!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్