కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలతో పాటు సినిమా రంగం పై కూడా బాగా పడింది. ఏప్రిల్ రెండో వారం నుంచి విడుదలకు సిద్దమైన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ సెకండ్ వేవ్ ఎప్పుడు తగ్గుతుందో..? ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎంతలేదన్నా.. మరో నాలుగు నెలల వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా. మరోసారి నిర్మాతలకు ఓటీటీ ఓ మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది. చిన్నసినిమాలు ఓటీటీ వైపు వెళ్లడం ఖాయం అని చెప్పచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే.. దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి ప్రదాన పాత్రల్లో నటించిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా విరాటపర్వం విడుదల ఆగింది.
అయితే.. ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చిందని తెలిసింది. ఏంటంటే.. ఈ సినిమాని 30 కోట్లకు కొంటామని ఆఫర్ ఇచ్చిందట. ఈమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా చిత్రం అరణ్య ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ.. రానా విరాటపర్వం చిత్రానికి 30 కోట్లు ఆఫర్ చేయడం అంటే.. మంచి ఆఫరే అంటున్నారు. మరి.. సురేష్ బాబు, రానా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.