దేశంలో కరోనా కొత్త కేసులు మరింత తగ్గాయి. 230 రోజుల కనిష్ఠానికి చేరి ఊరటనిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు రెండు లక్షల దిగువకు, మరణాలు 200లోపు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
ఆదివారం 9,89,493 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,596 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయిన కేసులు..తాజాగా మరింత తగ్గాయి. నిన్న 19,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.34 కోట్ల మంది వైరస్‌ను జయించారు.
గత కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు లక్షల దిగువకు చేరిన కేసులు.. మరింత తగ్గి 1.89 లక్షలకు క్షీణించాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.56 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.12 శాతానికి పెరిగింది. నిన్న 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,52,290 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
పండగ సెలవులు కారణంగా వ్యాక్సినేషన్ వేగం కాస్త మందగించింది. నిన్న కేవలం 12,05,162 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 97,79,47,783కి చేరింది.