Thursday, April 25, 2024
HomeTrending Newsఏప్రిల్‌ 4న కొత్త జిల్లాలకు ముహూర్తం

ఏప్రిల్‌ 4న కొత్త జిల్లాలకు ముహూర్తం

New Districts: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4న ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాలు లాంఛనంగా అవతరించనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ముహూర్తానికి ఆమోదం తెలియజేశారు.

నేడు క్యాంపు కార్యాలయంలో  కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం  తదితర అంశాలపై అధికారులతో సిఎం చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను సిఎస్‌, ఉన్నతాధికారులు సిఎంకు తెలియజేశారు.

అధికారులు అందించిన వివరాలు:

  • కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజలనుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయి
  • ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశాం
  • ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారు
  • సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు పరిగణలోకి తీసుకున్నాం
  • దీని ఆధారంగానే  కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేశాం
  • కొత్తజిల్లాలకు సిబ్బంది వెళ్లే  ఏర్పాట్లపై ఒక చెక్‌లిస్టు కూడా తయారుచేశాం
  • కొత్త జిల్లాలకు సంబంధించి నూతన వెబ్‌సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నాయి
  • వీటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నాం
  • అలాగే కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్‌ బుక్స్‌ కూడా తయారు చేశాం
  • కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారుచేశాం
  • సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశాం, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికిన తీసుకున్నాం

అధికారులకు సిఎం ఆదేశాలు:

  • సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలి
  • కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపిక చేయాలి
  • కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలి
  • కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండాలి
  • అంతేకాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ చేసుకోవాలి
  • ఈ భవనాలకోసం మంచి డిజైన్లను ఎంపికచేసుకోవాలి
  • పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలి
  • ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న  జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, ప్లానింగ్‌ సెక్రటరీ వి విజయకుమార్‌ ఇతర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్