న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధాని జెసిండా ఆర్డ్నెన్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆమె స్థానంలో 44 ఏళ్ల హిప్కిన్స్ బాధ్యతలు చేపట్టారు. దేశానికి నాయకత్వం వహించే సత్తా ఇక తనలో లేదని జెసిండా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను గవర్నర్ జనరల్ సిండీ కిరో ఆమోదించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో హిప్కిన్స్ మంత్రిగా చేశారు. అప్పుడు ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం
ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు హిప్కిన్స్‌కు భారీ మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న జనరల్ ఎలక్షన్స్‌లో లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే హిప్కిన్స్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం లేబర్ పార్టీకి పాపులారిటీ తగ్గినట్లు తెలుస్తోంది. ఈ రోజు (బుధవారం) హిప్కిన్స్ తొలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు.