Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్పాక్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్

పాక్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్

ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తమ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుంది. కాసేపట్లో మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా మైదానంలో దిగేందుకు న్యూజిలాండ్  ఆటగాళ్ళు నిరాకరించారు.  తమ ప్రభుత్వం సూచించిన భద్రతా హెచ్చరికల కారణంగా తాము సిరీస్ ను కొనసాగించలేమని న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్.జెడ్.సి.) ఓ ప్రకటనలో వెల్లడించింది.

పాకిస్తాన్ తో మూడు వన్డేలు, ఐదు టి-20 మ్యాచ్ లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ చేరుకొంది. వన్డే మ్యాచ్ లు రావల్పిండిలోను (సెప్టెంబర్ 17,19,21 తేదీల్లో); ఐదు టి-20 మ్యాచ్ లు (సెప్టెంబర్ 25,26,29-  అక్టోబర్ 1,3 తేదీల్లో) లాహోర్ లో ఆడాల్సి ఉంది. నేడు మొదటి మ్యాచ్ మొదటి కావాల్సి ఉండగా తమ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో టోర్నీ ఆడబోవడంలేదని న్యూజిలాండ్  అధికారులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలియజేసింది.

ఈ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు సెప్టెంబర్ 11న పాకిస్తాన్ చేరుకుంది. 2003 లో న్యూజిలాండ్ పాకిస్తాన్ దేశంలో పర్యటించింది. ఆ తర్వాత భద్రతా కారణాలతో పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడినప్పటికీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆడింది. దాదాపు 18 ఏళ్ళ తరువాత ఇప్పుడు పాక్ లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఒక్క బంతి కూడా అడకముందే టూర్ రద్దు చేసుకోవడం గమనార్హం.

తమ నిర్ణయం పాక్ బోర్డుకు ఆశనిపాతం అయినప్పటికీ, ఆటగాళ్ళ భద్రత తమకు అత్యంత ముఖ్యమైన అంశమని, పాక్ తమకు గొప్ప ఆతిథ్యం ఇచ్చిందని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వెల్లడించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్