Bay Oval, Mount Maunganui : బే ఓవల్ టెస్టులో న్యూజిలాండ్ ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ బౌలర్ ఎబాదోట్ హుస్సేన్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్ లో 147 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లా కంటే 17 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆరు వికెట్లకు 401 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన బంగ్లాదేశ్ మరో 57 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. నిన్న 20 పరుగులతో క్రీజులో ఉన్న మెహిదీ హాసన్ 47 పరుగుల వద్ద ఔటై అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. కీవీస్ బౌలర్లలో బోల్ట్ నాలుగు, వాగ్నర్ మూడు, సౌతీ రెండు, జేమిసన్ ఒక వికెట్ పడగొట్టారు.
బంగ్లా కంటే 130 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ 28 పరుగుల వద్ద తొలి వికెట్ (టామ్ లాథమ్-14); 63 వద్ద రెండో వికెట్ (డెవాన్ కాన్వె-13) కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ యంగ్, రాస్ టేలర్ మూడో వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, జట్టు స్కోరు 136 వద్ద 69 పరుగులు చేసిన యంగ్, హుస్సేన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో హెన్రీ నికోలస్ ను డకౌట్ చేసిన హుస్సేన్ తన తర్వాతి ఓవర్లో టామ్ బ్లండెల్ (డకౌట్) ను కూడా పెవిలియన్ పంపి ఒకే స్కోరు వద్ద మూడు వికెట్లు తీసి కివీస్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. రాస్ టేలర్-37, రచిన్ రవీంద్ర-6పరుగులతో క్రీజులో ఉన్నారు. హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టగా మరో వికెట్ టస్కిన్ అహ్మద్ కు దక్కింది.
Also Read : న్యూజిలాండ్ తో టెస్ట్: బంగ్లాదేశ్ 401/6