Kiwis women won: న్యూజిలాండ్- ఇండియా మహిళల క్రికెట్ సిరీస్ లో భాగంగా జరిగిన ఏకైక టి-20 మ్యాచ్ లో ఇండియా ఓటమి పాలైంది. కివీస్ విసిరిన 156 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇండియా విఫలమైంది. సబ్భినేని మేఘన -37; ఓపెనర్ యస్తిక భాటియా-26 మినహా మిగిలిన క్రీడాకారిణులు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగులతో పరాజయం పాలైంది. కీవీస్ బౌలర్లలో జేస్ కెర్ర్, అమేలియా కెర్ర్, హేలీ జేన్సేన్ తలా రెండు, కెప్టెన్ సోపీ డేవీస్, లియా తుహుహు చెరో వికెట్ సాధించారు.
క్వీన్ స్టోన్స్ లోని జాన్ విస్ ఓవల్ మైదానంలో భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు మొదలైన టి20 మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు కివీస్ 60 పరుగుల చక్కని ఆరంభం చేసింది. బేట్స్-36; కెప్టెన్ డేవిస్-31 పరుగులతో రాణించారు. అమేలియా కెర్ర్-17, మడ్డీ గ్రీన్-26; తుహుహు-27 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు; గాయక్వాడ్ ఒక వికెట్ పడగొట్టారు.
అల్ రౌండర్ ప్రతిభ ప్రదర్శించిన లీ తుహుహు కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఈ రెండు మహిళా జట్ల మధ్య వన్డే మ్యాచ్ లు ఇదే వేదికలో ఫిబ్రవరి 12, 15, 18, 22, 24 తేదీల్లో జరగనున్నాయి.
మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వ తేదీ వరకూ జరగనున్న న్యూ జిలాండ్ లోనే జరగనున్న ఐసిసి విమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ లకు సన్నద్ధం అయ్యేందుకు ఈ సిరీస్ ను ఉపయోగించుకోవాలని భారత మహిళల జట్టు భావిస్తోంది.
ఇవి కూడా చదవండి: అండర్ 19 వరల్డ్ కప్ : ఫైనల్లో ఇండియా