4th also kiwis: న్యూజిలాండ్ – ఇండియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే లో కూడా కివీస్ మహిళలు సత్తా చాటారు. 6 3 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు. వర్షం కారణంగా ఆటను చెరో 20 ఓవర్లు ఆడేలా కుదించారు. క్వీన్ స్టోన్స్ లోని జాన్ డేవిస్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆట మొదటి నుంచే కివీస్ మహిళలు ధాటిగా ఆడారు. తొలి వికెట్ కు 53 పరుగులతో మంచి శుభారంభం ఇచ్చారు.
అమేలియా కెర్ర్ 33 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ తో 68; ఓపెనర్ బాట్స్ 26 బంతుల్లో 7 ఫోర్లతో 41; కెప్టెన్, మరో ఓపెనర్ 24 బంతుల్లో 6 ఫోర్లతో 32; సత్తెర్ వైత్ 16 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లతో 32 పరుగులతో రాణించారు. దీనితో కివీస్ కేటాయించిన 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో రేణుక సింగ్ రెండు; మేఘన సింగ్, గయక్వాడ్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ సాధించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహిళలు 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ స్మృతి మందానా 13 చేయగా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ, యస్తికా భాటియా డకౌట్ అయ్యారు. పూజా వస్త్రాకర్ కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్ చేరింది. ఈ దశలో కెప్టెన్ మిథాలీ రాజ్, రిచా ఘోష్ ఐదో వికెట్ కు 77 పరుగులు చేసి కాస్త పరువు నిలిపారు. రిచా ఘోష్ కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి ఔటయ్యింది. మిథాలీ 30 పరుగులు చేసింది. 17.5 ఓవర్లలో 128 పరుగులకే ఇండియా ఆలౌట్ అయ్యింది. కివీస్ బౌలర్లలో హేలీ జేన్సేన్, అమేలియా కెర్ర్ చెరో మూడు; ఫ్రాన్సిస్ మాక్యీ, జెస్ కెర్ర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ సిరీస్ లో మరోసారి తన సత్తా చాటిన అమేలియా కెర్ర్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఈ సిరీస్ లో చివరి వన్డే 24న ఇదే వేదికగా జరగనుంది.