శ్రీలంకతో జరిగిన రెండో టి 20 లో ఆతిథ్య న్యూజిలాండ్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో సూపర్ ఓవర్లో లంక గెలుపొందిన సంగతి తెలిసిందే. డూనేడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
లంక జట్టు 29 పరుగులకే ఓపెనర్లు ఇద్దరి వికెట్లూ (పాతుమ్ నిశాంక-9; కుశాల్ మెండీస్-10) కోల్పోయింది. మూడో వికెట్ కు కుశాల్ పెరీరా- ధనుంజయ డిసిల్వా 62 పరుగులు జోడించారు. పెరీరా -35; డిసిల్వా-37; ఆశలంక-24 పరుగులు చేశారు. టెయిలెండర్లు కూడా విఫలం కావడంతో 19 ఓవర్లలో 141 పరుగులకే లంక ఆలౌట్ అయ్యింది.
కివీస్ లో.. మిల్నే ఐదు వికెట్లతో సత్తా చాటాడు, బెన్ లిస్టర్-2, షిప్లే, రచిన్ రవీంద్ర, నీషమ్ తలా ఒక వికెట్ సాధించారు.
కివీస్ 40 పరుగులకు తొలి వికెట్ (చాంద్ బోవ్స్-31) కోల్పోయింది. మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 79; కెప్టెన్ లాథమ్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచి 14.1 ఓవర్లలోనే గెలిపించారు. కుశాన్ రజిత కు ఒక వికెట్ దక్కింది.
ఐదు వికెట్లు సాధించిన ఆడమ్ మిల్నే కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సిరీస్ విజేతను నిర్ణయించే చివరి టి 20 శనివారం జరగనుంది.