Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇచ్చట తోలు ఒలచబడును!

ఇచ్చట తోలు ఒలచబడును!

తెలియనిది బ్రహ్మపదార్థం.
తెలిసీ తెలియనట్లు ఉంటే అయోమయం.
తెలియకపోయినా తెలిసినట్లు ఉంటే అజ్ఞానం.
తెలిసినా మౌనంగా ఉంటే సహనం.
తెలిసినా నొప్పిని భరిస్తూ ఉండడం కర్తవ్యం.
తెలిసినా ఏమీ చేయలేకపోవడం నిస్సహాయత.

ఇంకా చాలా అమూర్త భావనలు ఉన్నాయి కానీ – ఇది బ్రహ్మపదార్థ చర్చ అనుకుని పొరబడే అవకాశం ఉంది కాబట్టి మచ్చుకు కొన్ని అనుకుని వదిలేద్దాం. ఇది జాతీయ రహదారుల మీద మానవ మహోన్నత నాగరికతకు చిహ్నమయిన టోల్ గేట్ల మీద చర్చ.

సాంకేతికంగా ఒకప్పుడు గేట్ ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో టోల్ గేట్ మాట సరయినదే. ఇప్పుడు ఫోన్, ఫ్యాన్, ప్యూన్, కంప్యూటర్, ఏ సి, పేయింగ్ మిషన్లు ఉన్న గాజు గదులు వచ్చాయి కాబట్టి టోల్ బూత్ లు అని గౌరవంగా అంటున్నారు.

పరమ దుర్మార్గులమయిన మనం ఏదో ఒక అడ్డు లేకపోతే టోల్ రుసుము చెల్లించకుండా వెళ్లే ప్రమాదాన్ని నివారించడానికి టోల్ బూతుల దగ్గర ఇనుప రాడ్లు మాత్రం పెట్టక తప్పలేదు. ఈ రాడ్లను కూడా మొండిగా దాటి వెళ్లే రౌడీలను హ్యాండిల్ చేయడానికి ఒక్కొక్క బూత్ దగ్గర కర్రలు పట్టుకుని కండలు తిరిగిన వస్తాదులను కూడా సిద్ధంగా పెట్టుకుంటారు. వాళ్లకు ప్రత్యేకమయిన శిక్షణ ఏదో ఉండి ఉంటుంది. ఆ దారిలో భారత రాష్ట్రపతి వెళుతున్నా- వాడి చేతి కర్రతో ఆ కాన్వాయ్ ని ఆపగలిగిన ధైర్యం ఈ వస్తాదులకు ఉంటుంది. టోల్ గేట్, టోల్ బూత్ మాటలకంటే టోల్ రాడ్ కొంచెం దగ్గరి మాటగా అనిపిస్తుంది!

టోల్ రాడ్ ముందు నిత్యం కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ లు మనకు అలవాటే. డబ్బుకు డబ్బూ పోయి గంటలు గంటలు ఆలస్యం కావడం అందరి అనుభవంలో ఉన్న విషయమే. ఇకపై టోల్ రాడ్ ముందు వంద మీటర్ల పసుపు గీతలు వేస్తారట. వాహనాలు ఆ పసుపు గీతలు దాటి ఉంటే- టోల్ రుసుము కట్టాల్సిన పనిలేకుండా వాహనాలు వెళ్లపోవచ్చని కేంద్ర ఉపరితల రవాణా శాఖ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక్కో వాహనం టోల్ చెల్లించడానికి పది సెకన్లకు మించి ఆగాల్సిన అవసరం లేకుండా చేయడమట.

మనం కూడా సరదాగా కొన్ని కాకి లెక్కలు వేసుకుందాం. వంద మీటర్లు అంటే 328 అడుగులు. లారీ- బస్సులు 30 అడుగులు ఉంటాయి. కార్లు 15 అడుగులు ఉంటాయి. అంటే అయిదారు బస్సులు, పది, పన్నెండు కార్లు ఈ వంద మీటర్లలో నిరీక్షించవచ్చు. ఇంతకంటే లోతుగా వెళ్లడానికి నా లెక్కల జ్ఞానం చాలదు.

సరిగ్గా ఆరు నెలల క్రితం టోల్ రాడ్ల దగ్గర ఆపాల్సిన అవసరమే లేని జి పి ఎస్ ఆధారిత చెల్లింపులను తీసుకొస్తున్నాం అని ఉపరితల రవాణాశాఖ పెద్ద తల చెప్పింది. దేశంలో టోల్ బూత్ లన్నవి ఇక ఉండవు అని సెలవిచ్చారు. కొందరు అమాయకులు ఆ వార్త హెడ్డింగును చూసి “టోల్ గేట్లు ఎత్తేస్తున్నాం” అన్న మాటతో హమ్మయ్య ఇక టోల్ చెల్లించే అవసరం లేదని అపార్థం కూడా చేసుకున్నారు. ఇప్పుడు పసుపు గీతలు పడ్డాయి. రేపు ఎర్ర వాతలు పడతాయి.

రాయలసీమలో-
“వాడు నన్ను కొట్టె- నన్ను వాడు కొట్టె”
అని ఒక గజిబిజిలా అనిపించే సామెత వాడుకలో ఉంది.
ఇందులో సర్వనామాలు వెనక్కు ముందుకు మారాయి కానీ- రెండు సందర్భాల్లో కొట్టింది వాడే. దెబ్బలు తిన్నది వీడే. క్రియ కామన్.

టోల్ గేట్ల దగ్గర మన తోలు వలిచి మనచేతికే ఇచ్చే క్రియ కూడా కామన్. టోల్ వసూళ్ల లెక్కలు బ్రహ్మపదార్థం. అది హిమాలయాల్లో తపస్సుతో సిద్ధించిన దివ్యదృష్టికి తప్ప మామూలు మాంస నేత్రాలకు కనపడదు. దేశం మొత్తం మీద టోల్ గేట్ల దగ్గర నెలకు పది వేల కోట్ల రూపాయలు మాత్రమే మనం మన జేబుల నుండీ కడుతున్నా మనకు అర్థం కాని అయోమయం. వేసిన రోడ్లకు ఎన్ని యుగాలు మనం టోల్ కట్టాలో క్లారిటీ లేకపోయినా కడుతూ ఉండడం అజ్ఞానం.

మౌనంగా నొప్పిని భరించడం మన సహనం. మర్యాదగా టోల్ చెల్లించడం మన కర్తవ్యం. మన రోడ్లు మనమే వేసుకుని, మన రాడ్లు మనకే అడ్డుపెట్టుకుని, మన జేబులకు మనమే చిల్లు పెట్టుకోవడమే నాగరికత. దాన్ని మనం నిస్సహాయత అనుకుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది? మనకోసం వంద మీటర్ల పసుపు గీతలను దయతో వెయ్యి మీటర్లకు పెంచుతుంది.

అయినా వారం వారం జాతీయ రహదారి మీద పోను నాలుగు, రాను నాలుగు టోల్ గేట్ల దగ్గర నాకు కలిగిన అనుభవైకవేద్యమయిన అజ్ఞానమిది. మీకందరికీ జ్ఞానమే కలిగి ఉంటుందని; కలిగి ఉండాలని కోరుకుంటూ…

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్