Saturday, November 23, 2024
HomeTrending Newsకశ్మీర్ లోయలో ఎన్.ఐ.ఏ తనిఖీలు

కశ్మీర్ లోయలో ఎన్.ఐ.ఏ తనిఖీలు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఉన్మాదం మళ్ళీ మొదలైంది. రాజోరి జిల్లా పూంచ్ సెక్టార్లో రోజు వారి పెట్రోలింగ్ కు వెళ్ళిన జవాన్లపై ముష్కర మూకలు కాల్పులకు తెగపడటంతో నిన్న నలుగురు జవాన్లు, ఒక అధికారి అమరులయ్యారు. ఈ ఘటనతో లోయలో ఒక్కసారిగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టిన సైనిక బలగాలు ఈ రోజు ఉదయం ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చాయి. సోఫియన్లో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన ముగ్గురిలో ఒకరు గందేర్బాల్ కు చెందిన ముక్తార్ షా గా గుర్తించారు. ముక్తార్ కొన్నాళ్ళుగా లష్కర్ ఎ తోయిబా ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కశ్మీర్ లోయలో ఈ రోజు పెద్ద ఎత్తున సోదాలు మొదలుపెట్టింది. 16 ప్రాంతాల్లో ఏక కాలంలో ఎన్.ఐ.ఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. లష్కర్ ఎ తోయిబా సంస్థకు క్షేత్రస్థాయిలో సహకరించే వారి సంఖ్య ఇటీవల పెరిగిందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. రెండు రోజుల క్రితం కుల్గాం, శ్రీనగర్, బారాముల్లా జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లో ఎన్.ఐ.ఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకున్న ఎన్.ఐ.ఏ అధికారులకు ఉగ్రవాదుల కదలికలపై కీలక సమాచారం లభ్యమైనట్టు తెలిసింది.

షోపియన్ లో ఎన్కౌంటర్, ఎన్.ఐ.ఏ అధికారులు తనిఖీల నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శ్రీనగర్ పరిసర జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. వారం రోజుల వరకు ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని నిషేధం విధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్