నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. పీఎఫ్‌ఐ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, ఇతర కార్యకర్తల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతోపాటు అక్రమ నిధుల కేసులో తిరువనంతపురం, కొల్లాం, పటానంతిట్ట, ఎర్నాకుళం, అళప్పుజ, మళప్పురం జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే కేసులో బుధవారం కూడా అధికారులు దాడులు నిర్వహించారు.
దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇప్పటికే వంద మందికిపైగా పీఎఫ్‌ఐ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, పీఎఫ్‌ఐపై నిషేధం తర్వాత మరో పేరుతో తిరిగి సంస్థను స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు జరుగుతున్నాయని తెలుస్తున్నది.