ఐపీఎల్ ఈ సీజన్ లో మరో మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగింది. 212 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో చివరి బంతికి అద్భుత విజయం అందుకుంది. గుజరాత్ బ్యాట్స్ మెన్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 62రన్స్ సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం దిశగా తీసుకెళ్ళాడు.
బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కు 96 పరుగులు చేసింది. కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61; మాక్స్ వెల్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఔట్ కాగా … కెప్టెన్ డూప్లేసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79; దినేష్ కార్తీక్ ఒక పరుగుతోనాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, అమిత్ మిశ్రా చెరో వికెట్ సాధించారు.
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లక్నో 23 పరుగులకే మూడు వికెట్లు (కేల్ మేయర్స్- డకౌట్; దీపక్ హుడా-9, కృనాల్ పాండ్యా డకౌట్) కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక మ్యాచ్ పై లక్నో అభిమానులు ఆశలు వదులుకున్నారు. నాలుగో వికెట్ కు కెప్టెన్ కెఎల్ రాహుల్- స్టోనిస్ 76 రన్స్ జోడించారు. స్టోనిస్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు, ఆ కాసేపటికే కెప్టెన్ రాహుల్ (18) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో పూరన్ విధ్వంసం సృష్టించి 17ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు. మూడు ఓవర్లకు 24 పరుగులు కావాల్సిన దశలో హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో 9, పార్నెల్ వేసిన 19వ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి.
- హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో…
- తొలి బంతికి ఉనాడ్కత్ సింగల్ తీశాడు
- రెండో బంతికి మార్క్ వుడ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు.
- మూడో బంతికి రవి బిష్ణోయ్ రెండు;
- నాలుగో బతికి ఒక పరుగు సాధించాడు. దీనితో స్కోర్లు లెవెల్ అయ్యాయి.
- ఐదో బంతికి ఉనాద్కత్ అవుట్…
- చివరి బంతికి లెగ్ బై రన్ రావడంతో విజయం లక్నోను వరించింది.
నికోలస్ పూరన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.