Sunday, January 19, 2025
HomeTrending Newsఆంధ్రా జలదోపిడిని అడ్డుకుని తీరుతాం

ఆంధ్రా జలదోపిడిని అడ్డుకుని తీరుతాం

తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలు సైంధవపాత్ర పోషిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. హక్కు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తామని మంత్రి హెచ్చరించారు. దాదాగిరీ, గూండాగిరి నడవనివ్వమన్నారు. వనపర్తి జిల్లా రేవల్లిలో మంత్రి ఈ రోజు రైతు వేదిక ప్రారంభించారు.

మా హక్కులకు విరుద్దంగా కృష్ణా బేసిన్ లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వమని నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు.  కృష్ణా నది నుండి తెలంగాణకు హక్కుగా వచ్చే ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటామన్నారు. వెన్నెముక లేని బానిస నేతల మూలంగానే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఏపీ జలదోపిడీని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుని తీరుతామని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు.  సమైక్యపాలనలో ఆంధ్రా జలదోపిడీకి మద్దతుగా హారతులు పట్టినోళ్లు, దొంగ ప్రాజెక్టులకు సద్దులు మోసిన ఇంటి దొంగలు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని హాహాకారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కృష్ణాజలాల్లో తెలంగాణ నీటి వాటా తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని మంత్రి ఆరోపించారు. అసలు ప్రాజెక్టులు కట్టుకునేందుకు ఏపీకి శాశ్వత నీటి కేటాయింపులు ఎక్కడివని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం, దేశంలో రాజ్యాంగం అమలులో ఉందన్న విషయం ఏపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు.

నీటి కేటాయింపులు జరిగాక, అన్ని రకాల అనుమతులు వచ్చాకనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చి ఇప్పుడు అక్రమాలకూ పాల్పడుతోందన్నారు. ఏపి ప్రభుత్వ చర్యలు రాజ్యాంగానికి, విభజన చట్టంలోని నిబంధనలకు, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని మంత్రి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు నిర్ణీత కాలగడువు విధించి కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రా నీటివాటా తేల్చాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ – ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్నేహ హస్తం అందించారని, కేసీఆర్ దూరదృష్టితో చేసిన సూచనలను వదిలేసి కృష్ణా జలాలను అన్యాయంగా తీసుకుపోతామనడం మిత్ర ద్రోహమేనన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గర్హనీయమన్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చే నీటి సంపద, మత్స్యసంపద, జీవవైవిధ్యం, పశుసంపద,  మొత్తంగా వచ్చే సమాజ సంపద ఎంత  అనే అంశాలని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును  ప్రజలు గమనిస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్