Friday, April 19, 2024
Homeఫీచర్స్నా భార్యే నన్ను పట్టించుకోకపోతే ఎలా?

నా భార్యే నన్ను పట్టించుకోకపోతే ఎలా?

మనశ్శాంతి లేదు..

Q. నా వయసు 52 సం. ఆంధ్ర జ్యోతిలో మీ సమాధానాలు చదివి, నా సమస్యకు కూడా జవాబు ఇస్తారని రాస్తున్నాను. లాక్ డౌన్ మొదలుపెట్టిన తొలిరోజుల్లో మా మావగారు కళ్ళు తిరిగి పడిపోయాడనీ, వెంటనే రమ్మని నా భార్యకు ఫోన్ చేశారు. ఆమె బంధువు లందరికీ ఫోన్లు చేసి, కారు మాట్లాడుకుని వెళ్ళిపోయింది. నాకు చెప్పలేదు, నా అభిప్రాయం అడగలేదు. “వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను” అన్నది. సరే! తండ్రి కదా అనుకుని ఊరుకున్నాను. నెలరోజులు ఎదురు చూసినా తిరిగి రాలేదు. లాక్ డౌన్ వల్ల బయట హోటల్స్ లో తినడానికి అవకాశం లేదు. ఇంట్లో పని మొత్తం చేసుకోలేక, వంట రాక, చేయకపోతే నీరసంతో సతమతమయ్యాను. పైగా ఆన్ లైన్ క్లాసులు, పరీక్షలు (నేను టీచర్ జాబ్ చేస్తున్నాను). నా భార్యకు ఫోన్ చేస్తే ఇంకా రెండు, మూడు నెలల దాకా రాను అన్నది. వంటరి తనం, ఇంటి పని, చిత్తక్షోభ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు వచ్చింది నా దగ్గరకు. ఆమె వెళ్ళడానికి ఎక్కువ సహాయ పడింది నా అన్నకొడుకు అని తెలిసి “నా ఇష్టం లేకుండా నా భార్యను ఎందుకు పంపావు? నా గురించి ఆలోచించలేదా?” అని నిలదీశాను. వాడు తీవ్ర పదజాలంతో నన్ను దూషించాడు. కక్ష కట్టినట్లు మా అబ్బాయికి నా గురించి చెడుగా చెప్పాడు. వాడు కూడా దూషించాడు. ఆమెను రప్పించుకోవటానికి ఆత్మహత్య నాటకం ఆడానని అన్నాడు. నా భార్య కూడా వచ్చిన దగ్గరనుంచీ నాతో మాట్లాడటం లేదు. మొక్కుబడిగా వంట చేసి ఊరుకుంటుంది. అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. నా భార్య నాకు ప్రయారిటీ ఇవ్వాలని ఆశించటం తప్పా! నా దగ్గర ఉండాలని అనుకోవటం తప్పా! నాకు మనశ్శాంతి లేకుండా ఉంది. సరైన సలహా ఇవ్వగలరు.
-కృష్ణ

A. పవిత్రమైన, బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. పిల్లలకు తగాదాలు వస్తే తీర్చాల్సినవారు ఇంత చిన్న విషయానికి అంతగా మథన పడుతున్నారెందుకు? కన్నతండ్రికి బాగాలేదనగానే వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది. మిమ్మల్ని అడగలేదనడం నమ్మశక్యంగా లేదు. బహుశా మీరు తేలికగా తీసుకుని ఉంటారు. దాంతో ఆవిడ బంధువుల సాయంతో వెళ్లి ఉంటారు. ఎలాగూ లాక్ డౌన్ కదా మీకు స్కూల్ లేదనుకుని ఉంటారు. క్లాసులు ఈ మధ్యనే కదా మొదలయ్యాయి.మీరు కనీసం ఆవిడ వెళ్ళాక ఫోన్ చేసి మామగారి పరిస్థితి కనుక్కున్నారా? ఒకసారి వెళ్లి చూసారా? ఎంతసేపూ మీ కష్టాలే గానీ మీ భార్య మనోభావం ఏంటో తెలుసుకున్నట్టు లేరు. పైగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం ఏంటి? అందుకే ఆమె మనసు గాయపడి ఉంటుంది. ఎంతసేపూ మీ స్వార్థం చూసుకుంటున్నారని అనిపించిందేమో! ఇప్పటికైనా మీ భార్యతో వివరంగా మాట్లాడండి. మీ తప్పు ఒప్పుకోండి. మీకామె తోడు ఎంత అవసరమో వివరించండి. మీ కష్టాలలోనే కాదు, మీ భార్య కష్టాలు, సుఖాల్లోనూ మీరు తోడుగా ఉండాలి. లేకపోతే పెళ్లినాటి ప్రమాణాలకు అర్థం లేదు

కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
shobhas292@gmail.com

RELATED ARTICLES

Most Popular

న్యూస్