కోర్టులు జరిపే విచారణపై నమ్మకం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పెగాసస్ వివాదంపై విచారణ సందర్భంగా అయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ పై ఒకసారి అత్యున్నత న్యాయస్థానంలో విచారణ మొదలైన తరువాత సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో సమాంతర చర్చలు జరపవద్దని, చెప్పాల్సింది అంతా ధర్మాసనం ముందే చెప్పాలని, బైట చర్చలు చేస్తే అది కేంద్రమైనా, పార్టీలైనా తీవ్ర పరిణామాలుంటాయని అయన హెచ్చరించారు. కోర్టు హాల్ లో కూడా క్రమశిక్షణతో కూడిన చర్చలు జరగాలని తాము కోరుకుంటామని చెప్పారు. చెప్పాల్సింది అంతా ధర్మాసనానికి నేరుగా చెపాలని, అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సూచించారు.
పెగాసస్ పై తనకు కొన్ని కాపీలు ఇంకా అందాల్సి ఉందని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించేందుకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. కక్షిదారులు కూడా ఈ విషయంలో ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూస్తామని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ హామీ ఇచ్చారు. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే సోమవారం (ఆగస్ట్ 16) కు వాయిదా వేసింది.