Wednesday, June 26, 2024
HomeTrending NewsNobel Prize: మానవహక్కులే ఉపిరిగా... నర్గేస్ మహమ్మదీ

Nobel Prize: మానవహక్కులే ఉపిరిగా… నర్గేస్ మహమ్మదీ

మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీకి 2023 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ మేరకు నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ కమిటీ ఇవాళ ప్రకటించింది. నర్గేస్ మొహమ్మదీ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 19వ మహిళ కాగా ఆమె ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.

ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు, మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటానికి నర్గేస్ మొహమ్మదీకి 2023 నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించిందని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది.

ఇరాన్‌లోని మానవ హక్కుల కార్యకర్తలలో ప్రముఖురాలైన నర్గేస్ మొహమ్మదీ మహిళల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మహిళలకు హక్కుల విషయంలో ఇరాన్ లో అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నైతికత పోలీసుల కస్టడీలో కుర్దిష్ యువతి మహస అమినీ మరణించిన తర్వాత దేశంలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి.

మహిళల హక్కుల కోసం నర్గేస్ మొహమ్మదీ 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు దోషిగా నిర్ధారించబడి… మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. 154 కొరడా దెబ్బలు శిక్షగా భరించారని నోబెల్ బహుమతి వెబ్‌సైట్ లో పేర్కొన్నారు.  దీంతో మహిళల స్వేఛ్చ , మానవ హక్కులే ఉపిరిగా ఉద్యమిస్తున్న ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.

ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో మహమ్మదీ ఇప్పుడు టెహ్రాన్‌లోని జైలులో వివిధ కేసులకు సంబంధించి శిక్షలు అనుభవిస్తున్నారు. మొహమ్మదీ గత 18 నెలలుగా ఆమె భర్త తఘీ రహ్మానీతో ఆమె పిల్లలు అలీ ,కియానాతో మాట్లాడకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.

2003 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన షిరిన్ ఎబాడి నేతృత్వంలోని ప్రభుత్వేతర సంస్థ అయిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌కు… జైలుకు వెళ్ళే ముందు నర్గేస్ మొహమ్మది ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.

మహమ్మదీకి శాంతి బహుమతిపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. విదేశీ మీడియా కథనాల ప్రకారం  ఆన్‌లైన్ సందేశాలలో మొహమ్మదీ విజయం సాధించారని పోస్టులు పెడుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్