Friday, November 22, 2024
HomeTrending Newsముగిసిన నామినేషన్ల ఘట్టం

ముగిసిన నామినేషన్ల ఘట్టం

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 763, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు పడ్డాయి. ఎన్నికల అధికారులు శుక్రవారం వాటిని పరిశీలిస్తారు. ఈనెల 29 వరకు ఉపసంహరణ గడువు ఉండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లు లెక్కింపు ఉంటుంది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి.

వచ్చే రెండు వారాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తనుంది. తెలంగాణాలో బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల మధ్య ముక్కోణపు పోటీ ఉండగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ – బిజెపిల మధ్యనే పోటీ కేంద్రీకృతం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

లోక్ సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఏపీలో రాజకీయ పార్టీల ప్రచారం సందడిగా సాగుతోంది.  తెలుగుదేశం, జనసేన, బిజెపిలు కూటమిగా బరిలోకి దిగాయి. గత ఎన్నికల మాదిరే వై.ఎస్.ఆర్.సి.పి ఎవరితో పొత్తు లేకుండా బరిలోకి దిగింది. సిఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు.

పార్టీ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపిలో రంగంలో ఉంది. 2014,2019తో పోలిస్తే ఈ దఫా కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్