ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సర్కార్ సిఫారసు మేరకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ రద్దు అయ్యిందని అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాక్‌లో పదవీకాలానికి ముందుగానే సభను రద్దు చేస్తే 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఎంపికపై చర్చలు ప్రారంభం అయ్యాయి. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్… ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్ అహ్మద్ తో భేటీ అయ్యారు. ఇస్లామాబాద్ లో జరిగిన సమావేశంలో ఇద్దరు నేతలు ఈ అంశంపై సుదీర్గంగా చర్చించారు. రెండు రోజుల్లో ఆపద్ధర్మ ప్రధానమంత్రి నియామకం జరగనుంది. అప్పటి వరకు షహబాజ్ షరీఫ్ కొనసాగనున్నారు.
పాకిస్థాన్ ముస్లిం లీగ్…పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మిత్ర పక్షాలుగా ఉన్నా రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య విభేదాలు పొడచూపే అవకాశాలు ఉన్నాయి. అందుకు బీజం ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఎంపిక దగ్గర నుంచే మొదలు కానుందని పాక్ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.