Chai – Biscuit: స్వేఛ్చ, అధికారం, పెత్తనం లేకుండా బీసీలు ఎంతమందికి పదవులు ఇస్తే ఏమి ప్రయోజనమని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ‘చాయ్ బిస్కెట్ కేబినెట్’ అని అభివర్ణించారు. ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చామన్నది ప్రధానం కాదని, ఎంత ప్రాధాన్యం ఇచ్చామన్నదే ముఖ్యమన్నారు. ప్రాధాన్యం వేరు, ప్రాతినిధ్యం వేరని చెప్పారు. కొన్ని కులాల్లో … ఉన్నవారిని తీసివేసి కొత్తవారికి ఇచ్చారని, పాతవారిని ఎందుకు తీసేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం 1983లో ఎన్టీఆర్ పాలన నుంచి మొదలయ్యిందని గుర్తుచేశారు.
కేబినెట్ లో మంత్రులకు స్వేఛ్చ లేదని, సిఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, బీసీలకు ప్రాధాన్యం, పెత్తనం లేని పదవులు ఇచ్చారని రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ప్రాతినిధ్యం కంటే అధికారంలో భాగస్వామ్యం అవసరమన్నారు. బీసీ మంత్రులు స్వేచ్చగా తమ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని, కానీ ఇక్కడ మంత్రులతో సంబంధం లేకుండా సిఎం స్వయంగా అన్ని నిర్ణయాలూ తీసుకుంటున్నారని విమర్శించారు. సిఎం కోర్ కమిటీలో ఎస్సీలు, బీసీలు ఎవరూ ఎందుకు లేరని, ముఖ్య సలహాదారుల పోస్టుల్లో ఎందుకు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని యనమల సూటిగా ప్రశ్నించారు.
కేబినెట్ ప్రక్షాళన చేస్తానని చెప్పుకున్న సిఎం జగన్ 11మంది పాత వారినే మళ్ళీ పెట్టుకున్నారని, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వచ్చే ప్రమాదం ఉందని భావించి ఒత్తిడికి తలొగ్గారని, భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేబినెట్ అనేది వారిష్టం అయినప్పటికీ… ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, నేతలు సిఎం పై తిరుగుబాటుకు ఆస్కారం ఉందని, అందుకే జగన్ వారి ఒత్తిళ్లకు లొంగారని విమర్శించారు.
Also Read : వనితకు హోం, వైద్యానికి రజని