శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన ‘ఓం భీమ్ బుష్’ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. సునీల్ బులుసు నిర్మించిన ఈ సినిమాకి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. దర్శకుడు శ్రీవిష్ణుతో సమానంగా ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ పాత్రలను కూడా నడిపించాడు. ఈ కథ ఇంటర్వెల్ వరకూ గ్రామీణ నేపథ్యంలో .. సెకండాఫ్ అంతా కూడా ఒక పాడుబడిన బంగ్లాలో నడుస్తుంది. హారర్ కామెడీ అనిపిస్తుందిగానీ, కామెడీనే ప్రధానంగా సాగే కథ ఇది. శ్రీ విష్ణు వైపు నుంచి లవ్ ఉంటుందిగానీ, దానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువే.
ఒక పాడుబడిన బంగ్లాలో ‘నిధి’ ఉందని తెలిసిన ముగ్గురు స్నేహితులు, ఆ డబ్బుతో హాయిగా సెటిలైపోవచ్చని ఆశపడతారు. అయితే అంతకుముందుగా ఆ బంగళాలో ఉన్న దెయ్యాన్ని తరిమేయవలసి ఉంటుందనేదే ట్విస్టు. అయినా ఆ విషయాన్ని లైట్ గా తీసుకుని లోపలికి అడుగుపెట్టిన ఆ స్నేహితులకు ఎలాంటి అనుభవం ఎదురైందనేది కథ. దెయ్యానికీ .. ఈ స్నేహితులకు మధ్య జరిగే దాగుడుమూతలాటగా ఈ కథ నవ్విస్తుంది. మొదటి నుంచి చివరివరకూ బోర్ అనిపించకుండా సాగుతుంది.
శ్రీవిష్ణు కొంతకాలంగా హాస్యప్రధానమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన ఇంతకుముందు చేసిన ‘రాజ రాజ చోర’ .. ‘సామజవరగమన’ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయనకి హిట్ తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథలో అనూహ్యమైన ట్విస్టులు ఏమీ లేకపోయినా, దర్శకుడు కామెడీ కంటెంట్ తోనే మెప్పించాడు. ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ తమ మార్క్ చూపించారు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ ను అందించే సినిమాగా చెప్పుకోవచ్చు.