Saturday, January 18, 2025
Homeసినిమానాకు ఇష్టం అయితే ఎక్కడికైనా వస్తా: అల్లు అర్జున్ వ్యాఖ్యలు

నాకు ఇష్టం అయితే ఎక్కడికైనా వస్తా: అల్లు అర్జున్ వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి కీలక వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి బన్నీ బహిరంగంగా మద్దతు తెలపడం… ఈ పరిణామం మెగా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారడం విదితమే. దీనితో మెగా-అల్లు కుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా అల్లు అర్జున్ తాజా కామెంట్స్ ఉన్నాయి. గత రాత్రి  ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ పాల్గొన్నారు. సీనియర్ నటుడు రావు రమేష్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాను  దర్శకుడు సుకుమార్ భార్య సబిత సమర్పిస్తున్నారు.  లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… “ఇష్టమైన వాళ్లకు మనం చూపించాలి, వాళ్ళ కోసం మనం నిలబడాలి, మన ఫ్రెండ్ అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో… నాకు ఇష్టం అయితే వస్తా, నా మనసు కు నచ్చితే నేను వస్తా…  అది మీ అందరికీ తెలిసిందే” అని బన్నీ చెప్పాడు.

అల్లు-మెగా విభేదాల నేపథ్యంలో పుష్ప 2 సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిందని, అల్లు అర్జున్ గడ్డం తీసేసి విదేశాలకు వెళ్ళాడని కూడా పుకార్లు వ్యాపించాయి. వీటికి చెక్ చెబుతూ సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ ఈ వేడుకకు హాజరు కావడం గమనార్హం.

తాజా కామెంట్లపై మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏర్పడ్డ విభేదాలను తొలగించుకునే విధంగా అల్లు అర్జున్ ఏమైనా చేస్తాదనుకుంటే… మరోసారి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదని అంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనఃస్పర్ధలేనని వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్