రామ్ – పూరి కాంబినేషన్ లో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ నిన్న థియేటర్లకు వచ్చింది. పూరి సొంత బ్యానర్లో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్టుగానే థియేటర్ల దగ్గర జనాలు కనిపించారు. కానీ థియేటర్లలోకి అడుగుపెట్టిన ప్రేక్షకులను పూరి సంతృప్తి పరచలేకపోయాడు. కథలోకి వెళితే .. హైదరాబాద్ చెందిన శంకర్, చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. దొంగతనాలు చేస్తూ బ్రతికేస్తూ ఉంటాడు. అలాంటి అతని కోసం లండన్ నుంచి ‘బిగ్ బుల్’ టీమ్ రంగంలోకి దిగుతుంది.
బిగ్ బుల్ (సంజయ్ దత్) మాఫియాడాన్ గా నేర సామ్రాజ్యన్ని స్థాపించిన వ్యక్తి. అలాంటి అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని డాక్టర్లు తెలుస్తారు. మూడు నెలలకిమించి బ్రతకడం కష్టమని అంటారు. వేలకోట్ల ఆస్తులు .. విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని చనిపోవడం అతనికి ఇష్టం ఉండదు. అదే సమయంలో మెమరీ ట్రాన్ఫర్ అనే సలహా అతనికి నచ్చుతుంది. తన మెమరీని ట్రాన్స్ ఫర్ చేయడానికి తగిన వ్యక్తిని అన్వేషిస్తున్న అతనికి శంకర్ గురించి తెలుస్తుంది.
ఇక అప్పటి నుంచి బిగ్ బుల్ కీ .. శంకర్ కి మధ్య నడిచే యుద్ధమే ఈ సినిమా. రామ్ – సంజయ్ దత్ పాత్రలను పూరి డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. కానీ హీరోయిన్ పాత్రను ఆయన సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. రామ్ జోడిగా ఆమె సెట్ కాలేదనే అనిపిస్తుంది. పైగా ఇద్దరి మధ్య ఆశించిన స్థాయి రొమాన్స్ లేకపోవడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. మణిశర్మ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ ను మించిన వినోదాన్ని పంచుతుందనుకున్న ఈ సినిమా, డబుల్ డోస్ ను ఇవ్వకపోగా, ఫస్టు పార్టు కంటే డోస్ తగ్గిందనే అనిపిస్తుంది..