disappointed: ప్రతిసారీ చేస్తున్నట్లుగానే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు కోసం ఎలాంటి చర్యలూ బడ్జెట్ లో లేవని, విభజనతో నష్టపోయిన, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఏపీ అభివృద్ధికి మరింతగా ఊతమివ్వాల్సి ఉంటుందని, కానీ మరోసారి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. విభజన గాయాలు ఇంకా మానని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉదారంగా సాయం చేయాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం దాన్ని విస్మరించడం బాధాకరమని నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రానికి రావాల్సిన అంశాలపట్ల తమ ప్రయత్నం ఆపబోమని సజ్జల స్పష్టం చేశారు.
ఉద్యోగులు ఈనెల ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్లు చెప్పారని, దానికి మూడ్రోజులు మందుగా ఛలో విజయవాడ పేరిట ఆందోళనకు దిగడం సరికాదన్నారు. అది బలప్రదర్శనగానే భావిస్తామని, అవసరం లేనిచోట ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడంలేదని, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ చొరబడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగానే ఉందని చెప్పామని, సమ్మెకు పోకుండా చర్చలు చేద్దామని ప్రతిపాదించామని, అయితే వారు అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావాలన్నట్లు వ్యవహరిస్తున్నారని సజ్జల వెల్లడించారు. రాజకీయ ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగ సంఘాల నేతల్లో ఉన్నట్లు అవగతమవుతోందని అన్నారు. కరోనా మూడో వేవ్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు ఇలాంటి ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు ఇస్తే అరెస్టులు చేస్తారని, ఇది తెలిసీ వారు పిలుపు ఇవ్వడం శోచనీయమన్నారు.
దేశంలో ఈ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని, ఆ ఉద్యోగులు ఈ సమ్మెను వ్యతిరేకిన్చాల్సింది పోయి వారు కూడా ఉద్యమ కార్యాచరణలో తాము కూడా పాల్గొంటామని చెప్పడం సమంజసం కాదన్నారు. బస్సులు ఆపి జనజీవనం స్తంభించడం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోందన్నారు.
Also Read : పనికి మాలిన.. పసలేని బడ్జెట్ – సిఎం కెసిఆర్