Opportunity To Be Mlc Siddipet Collector
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన లో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎం హామీ ఇవ్వడంతో పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.
వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ ఉద్యోగం నుంచి ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 1991 లో గ్రూప్-1 అధికారిగా వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ సర్వీస్‌ల్లో చేరారు. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆయన ఆర్డీవోగా పనిచేశారు. మెదక్‌లో డ్వామా పీడీగా, హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన ఏడేళ్లు జేసీగా, కలెక్టర్‌గా పని చేశారు
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్ పుష్ప ఇన్ఫ్రా కంపెనీ లో ఆయనకు భాగస్వామ్యం ఉందని అలాంటి సంస్థ కు ప్రభుత్వం తక్కువ ధరకు భూమి కేటాయించిందని మరో సందర్భంలో ఆరోపించారు. సిద్ధిపేట కలక్టరేట్ ప్రారంభించే సమయంలో జిల్లా ఉన్నతాధికారి వెంకట్ రామి రెడ్డి కెసిఆర్ కాళ్ళు మొక్కటం వివాదాస్పదమైంది. వరి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైతులను హెచ్చరించిన అంశంలో వెంకట్ రామ్ రెడ్డి పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ రోజు రాజీనామా తో రేవంత్ రెడ్డి ఆరోపణలకు బలం చేకూరినట్టు అయింది.
Also Read : బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తం