Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసావర్కర్- గాంధీల్లో ఎవరు గొప్ప?

సావర్కర్- గాంధీల్లో ఎవరు గొప్ప?

Rajnath Singh Comments on VD Savarkar Mercy petitions…చరిత్ర అడక్కు…చెప్పింది విను…అని ఒక ఫేమస్ డైలాగ్.  చరిత్రను ఎవరూ మార్చలేరు. కానీ చరిత్ర పుస్తకాలను ఎవరికి వారు వారికి కావాల్సినట్లు మార్చుకోగలరు. కాబట్టి చరిత్ర పుస్తకాల్లో ఉన్నదంతా నిజమయిన చరిత్ర కాకపోవచ్చు, కావచ్చు.  చరిత్ర నిర్మాణానికి ఆధారాలు, సాక్ష్యాలు, కాలానుగుణమయిన రుజువులు, శాసనాలు, ఉత్తరాలు…చాలా ఉండాలి. జరిగింది గత చరిత్ర. జరుగుతున్నది నడుస్తున్న చరిత్ర.

చరిత్ర కొందరి చేతిలో మైనం ముద్ద. ఎలా కావాలంటే అలా ఒదిగిపోతుంది. ఎక్కడికయినా దిగిపోతుంది. ఎంతకయినా ఎదిగిపోతుంది.

బ్రిటీషువారు రాగానే భారత చరిత్రను తిరగరాశారు. వారు పోయినా…చింత చచ్చినా పులుపు చావనట్లు భారత బ్రిటీషు మెదళ్లు కూడా బ్రిటీషు దారిలోనే మన చరిత్ర మనది కాదని నిరూపించే పనిలో పాతాళం లోతులు చూశారు. చరిత్రకు కుడి- ఎడమ చూపు ఉండదు. ఉండకూడదు. కానీ డెబ్బయ్ అయిదేళ్లుగా మన చరిత్రకు ఉంటే ఎడమ చూపు; లేదా కుడి పక్క చూపులే తప్ప…అసలు చూపు మసకబారింది. లెఫ్ట్ దృక్కోణం ఉన్నవారికి ఎడమ చూపు ఇష్టం. రైట్ దృక్కోణం ఉన్నవారికి కుడి చూపు ఇష్టం. ఒక వయసురాగానే చత్వారం సహజం. హ్రస్వ దృష్టి షార్ట్ సైట్ కావచ్చు. దూర దృష్టి లాంగ్ సైట్ కావచ్చు. అలాంటప్పుడు కళ్లజోడు తప్పనిసరి. ఏ రంగు కళ్ల జోడు పెట్టుకుంటే…చరిత్ర ఆ రంగులోనే కనపడుతుంది. ఇంతకంటే లోతుగా వెళితే కంటి జబ్బులు, పరీక్షలు, శుక్లాలు, కళ్లజోళ్లకు సంబంధించిన ఆప్తమాలజి అవుతుంది. అది కంటి వైద్యుల సబ్జెక్ట్. మనం చారిత్రక దృక్కోణానికే పరిమితమవుదాం.

వీర్ సావర్కర్ బ్రిటీషు వారిని క్షమాభిక్ష కోరుతూ తనను ప్రవాస కారాగారం నుండి విడుదల చేయాలని లేఖ రాసినట్లు చరిత్రలో ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ ఉత్తరం సావర్కర్ తనకు తానుగా రాసింది కాదని…గాంధీ ఒత్తిడి మేరకే రాశాడని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా చరిత్ర తేనె తుట్టెను కదిపారు. ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇలాంటి భావోద్వేగ అంశాలను ఉద్దేశపూర్వకంగా వివాదం చేసి…జనంలో చర్చ జరిగేలా చేయడం బి జె పి కి అలవాటే అంటూ…బి జె పి ఏమి కోరుకుందో కాంగ్రెస్ అదే చేస్తోంది. వెంటనే లెఫ్ట్ ఏచూరి కూడా వంత పాడుతూ అదే వలలో పడుతున్నారు. దేశవ్యాప్తంగా చరిత్రకారులు సావర్కర్ ఉత్తరం విషయంలో రెండుగా చీలిపోతున్నారు. జాతీయ మీడియా ఈ విషయం మీద చర్చోపచర్చలు మొదలు పెట్టింది.

క్షమాభిక్ష పెట్టి జైలు నుండి విడుదల చేయాలని సావర్కర్ బ్రిటీషు ప్రభువులను ప్రాధేయపడుతూ ప్రాపర్ ఛానెల్లో అభ్యర్థన పెట్టుకోవడం నిజం. ఆ అభ్యర్థన ఉత్తరం ఇప్పటికీ ఉంది. అయితే స్వాభిమాన దేశభక్తుడయిన సావర్కర్…అంత బేలగా బ్రిటీషువారిని ప్రాధేయపడే రకం కాదని; మహాత్మా గాంధీ ఒత్తిడితోనే అలా రాశాడని రాజ్ నాథ్ సింగ్ చెబుతున్నారు. అందుకుతగ్గ ఆధారాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు.

ఈ చర్చతో చిర్రెత్తిన మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ మీడియా ముందుకు వచ్చి తన వాదన తను వినిపిస్తున్నారు. సావర్కర్ సోదరుడు గాంధీని కలిసి…జైలులో ఆయన ఆరోగ్యం విషమిస్తోందని ఆందోళన వ్యక్తం చేయడంతో… ప్రవాసంలో జైలులో ఉండడం కంటే…క్షమా భిక్ష కోరాలని…వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే సావర్కర్ కు ఆ సలహా ఇస్తూ ఉత్తరం రాశారని ఒక డాక్యుమెంట్ ను చూపుతున్నారు.

ఇందులో ఏది నిజమో?
ఏది వక్రీకరణో?
తెలియకుండా చర్చ ఎటెటో వెళ్లిపోతోంది. సావర్కర్ వచ్చి చెప్పడు. గాంధీ మహాత్ముడు వచ్చి వివరణ ఇచ్చుకోలేడు. తుషార్ గాంధీ చూపుతున్న ఉత్తరం ప్రకారం సావర్కర్ కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకే గాంధీ స్పందించినట్లు అనిపిస్తుంది.

సావర్కర్ దేశ భక్తి గొప్పదే. ఆ భక్తిని ఆకాశానికెత్తడానికి గాంధీని తక్కువ చేయడం మాత్రం మంచిది కాదు అన్నది ఒక వాదన.

ఇప్పుడు తారీఖులు దస్తావేజుల టైమ్ లైన్ ఆధారాల ప్రకారం అసలు విషయం ఏమిటో చూద్దాం.

  1. సావర్కర్ తొలిసారి జైలు నుండి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నది 1911 లో.
  2. నా అభ్యర్థనను పరిశీలించండి అని మళ్లీ ఉత్తరం రాసింది 1913 లేదా 1914 లో.
  3. సావర్కర్ మొదటి క్షమాభిక్ష ఉత్తరం 1911 నాటికి గాంధీ భారత్ లో లేనే లేడు. దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. 1913/14 రెండో ఉత్తరం నాటికి కూడా గాంధీ ఇక్కడ అందుబాటులో లేడు.
  4. సావర్కర్ క్షమాభిక్ష కోరడం మంచిది అని గాంధీ సావర్కర్ తమ్ముడికి ఉత్తరం రాసింది 1920 లో.
  5. గాంధీజీ ఒత్తిడితోనే సావర్కర్ క్షమాభిక్ష అడిగాడు. లేకపోతే అడిగేవాడే కాదు అని రాజ్ నాథ్ సింగ్ చెప్పడాన్ని ఎలా నమ్మాలి?
  6. అటు గాంధీ మునిమనవడు, ఇటు సావర్కర్ ముని మనవడు మీడియా తెరలముందు మాట్లాడుతుంటే చూడ్డానికి, వినడానికి ఇబ్బందిగా ఉంది.
  7. సావర్కర్ కుటుంబ సభ్యులు ప్రాధేయపడితే…గాంధీ చెబితే వింటారన్న ఆశతో వారడిగితే…గాంధీ ఉత్తరం రాశారన్నది గాంధీ ముని మనవడి వాదన.
  8. సావర్కర్ ను తక్కువ చేయడానికి ఇదంతా గాంధీ భజనపరులు ప్లాన్డ్ గా చేసిన ఉత్తరాయణం అన్నది సావర్కర్ మునిమనవడి వాదన.
  9. అహింసా ఉద్యమాన్ని ఒక ఆయుధంగా మలచుకున్న గాంధీ సావర్కర్ కోరికను సమర్థిస్తూ…వారి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే క్షమాభిక్ష సలహా ఇచ్చి ఉంటారనే రుజువులను బట్టి తెలుస్తోంది.

రాజకీయ చదరంగంలో ఏ పావు ఎందుకు ఎప్పుడు ఎలా కదిలించాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ సావర్కర్ పావు ఎందుకు కదిలిందో మున్ముందు తెలుస్తుంది.

మన చారిత్రక దృష్టికి దిష్టి తగిలింది. దిష్టితీసే దృష్టి దోషం లేని సరయిన చూపున్న వారు రావాలి.

వస్తారా?

దేశానికి రక్షణ మంత్రి చరిత్రను కూడా రక్షించాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేం.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్