Friday, March 29, 2024
HomeTrending Newsతుది దశ ఉద్యమానికి సిద్ధం కావాలి - రేవంత్ రెడ్డి

తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాలి – రేవంత్ రెడ్డి

తొలి దశ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించారు. మలిదశ ఉద్యమంలో అమరవీరులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చాలా ఏళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి తెలంగాణ చైతన్యం కనిపిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమ కోల్పోలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేయడం సంతోషాన్ని కలిగిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఉద్యమం చేసింది ఎవరూ, ప్రాణాలు ఆర్పించిందెవరూ, జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడిందెవరూ, ఇప్పుడు రాజ్యాన్ని ఏలుతుందెవరూ..ఈ 8 ఏళ్లుగా మనమందరం చూస్తూనే ఉన్నాం.

ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు తదితరులతో కూడిన ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణకు ఏదీ మంచిదో అదే చేస్తాం అని టీఆర్ఎస్ తన మ్యానిఫెస్టోలో వాగ్ధానం చేసింది. దీన్ని మేము కూడా నమ్మాం. తెలంగాణ శాసనసభ తొలి సమావేశంలో తెలంగాణ మలి దశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షల ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, వ్యవసాయం కోసం 3 ఎకరాల భూమి ఇస్తాం అని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి పార్టీలకతీతంగా అందరం మద్దతు ఇచ్చాం. ఇది జరిగి 8 సంవత్సారాలు అవుతున్నా 550 కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించిన కొంత మంది అమరులకు సంబంధించిన పత్రాల్లో అడ్రస్ తెలియదని రాశారు. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? చిన్న అగ్గిపుల్ల తాకితేనే అమ్మ అని అంటాం. కానీ శ్రీకాంతాచారి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ప్రాణాలు పోతున్న కూడా జైతెలంగాణ అని నినదించాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమన్నాడు. ఒకవేళ నేను చచ్చినా తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మించి ప్రాణత్యాగం చేస్తా అన్న శ్రీకాంత్ చారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా? మొన్నటి మొన్న కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ సునీల్ నాయక్ ‘‘నేను చేతకాక చావడం లేదు. ఉద్యోగాల అనే ముసుగుతో అధికారమెక్కిన ఈ పాలకులకు కనువిప్పు కలగాలి ‘‘ అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనాటి శ్రీకాంత్ చారి నుంచి ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో.

గతంలో ఓయూకు రాకుండా నన్ను అడ్డుక్కోవాలని చూసినా వచ్చి విద్యార్థులకు అండగా ఉన్నా. మీకడుపు నిండితే, మీ ఇల్లు పండితే చాలా? తెలంగాణలో నిరుద్యోగులు, యువత గురించి పట్టించుకోరా అని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు నియమించిన బిశ్వాల్ కమిటీ తెలంగాణలో 1.92 లక్షల ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. 9 ఏళ్లు అయిన ఆ ఖాళీల భర్తీ ఎందుకు ప్రారంభించ లేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ (సీఎంఐఈ) ప్రకారం..దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 5లో ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మొదటి స్థానంలో ఉంది. దేశ యావరేజ్తో చూసినా రాష్ట్రంలో 2 శాతం నిరుద్యోగం అధికంగా ఉంది. రాష్ట్రంలో 8.8 శాతం నిరుద్యోగ రేటు ఉంటే.. దేశంలో 6.8 శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ డేటాలో తేలింది. సమస్య ఇంత త్రీవంగా ఉంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేసిన పాపాన పోలేదు.

60 ఏళ్ల ఉద్యమం ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో అనుకున్న ఆశయాలు నేరవేరయా లేదా అని విశ్లేషించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈ కార్యక్రమంతో తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాల్సిన సందర్భం ఇది. తొలి దశ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించారు. మలిదశ ఉద్యమంలో అమరవీరులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చింది అని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో దుర్మార్గపు రాజ్యం నడుస్తోంది. 60 ఏళ్ల ఆంధ్రా పాలనలో కూడా ఇంత దారుణం జరగలేదు. ఓయూలోకి పోలీసులు రావాలంటే గతంలో భయపడేవారు. కానీ ఇపుడు పోలీసులు ఓయూలోకి వచ్చి అణచివేస్తున్నారంటే ఈ పాలన ఎలాంటిదో అర్థం చేసుకోండి. రాచరికపు మనస్తత్వంతోనే తెలంగాణలో అణచివేత సాగుతోంది.
తెలంగాణ వస్తే రక్తం చిందదన్నారు.. కానీ ఎన్ కౌంటర్లు జరిగాయి. కేసీఆర్ నక్సలైట్ల ఎజెండా ఎక్కడపోయింది. కుటుంబానికి పదవులు ఇవ్వాలని ఏ ఏ నక్సలైట్ల ఎజెండాలో రాసి ఉంది? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని, అమరు కుటుంబ సభ్యులకు ప్రజా ప్రతినిధులుగా అవకాశం ఇవ్వకూడదని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఏ ఎజెండాలో ఉంది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం తెలంగాణ రాష్ట్రం తెచుకున్నాం. నిజాం నవాబులు కూడా అభివృద్ధి చేశారు. అభివృద్ధి నమూనా అయితే నిజాంకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం జరిగింది.

మొన్ననే నవంబర్ 29న దీక్షా దివస్ అంటూ ఒక్క బక్క పలుచటోడు ఒక్కడై కదిలి తెలంగాణను సాధించాడు అని టీఆర్ఎస్ నాయకులు జోరుగా సంబరాలు చేసుకున్నారు. కానీ ఆదే రోజున శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకుంది. ఆ రోజు చర్చ జరిగితే శ్రీకాంతాచారి బలిదానం గురించి జరగాలి. చివరకు అమరవీరుల స్థూపం కూడా కాంట్రాక్టు ఆంధ్రా వాళ్లకు అప్పగించారు. రూ. 62 కోట్లతో మొదలు పెడితే రూ. 200 కోట్లకు చేరింది. 15 నెలల్లో పూర్చి కావల్సింది 6 ఏళ్లు అయినా కాలేదు. రూ.200 కోట్లు రూ.300 కోట్లు అయ్యే పరిస్థితి వచ్చేలా ఉంది. యాదాద్రి పునర్ నిర్మాణం కూడా ఆంధ్రావాళ్ల కనుసన్నుల్లోనే జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు భవిష్యత్ ప్రణాళిక రూపొందించండి. మేం ఎం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందో చెప్పండి. దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇతరుల్లా చెప్పేదొకటి చేసేదొక మనస్తత్వం నాది కాదు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కృషి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు ఇచ్చిన సూచన పత్రాన్ని మా మేనిఫెస్టోలో పెడతాం. తెలంగాణ సమాజం కేసీఆర్ కు సర్వం ఇచ్చింది. ఇక ఇచ్చేదేం లేదు. కేసీఆర్ ను దించితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్