వైసీపీ ముక్త ఆంధ్ర ప్రదేశ్ జనసేన నినాదమని, దీనితోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని, దీనికి సంబంధించి తమ వ్యూహాలు తమకున్నాయని చెప్పారు. వైసీపీని అధికారంలోకి రాకుండా చూస్తామని సవాల్ విసిరారు. రాజధాని లేని ఏకైక రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ అని, ఇది మనందరికీ సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ నిర్మాణపరంగా ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటామన్నారు. ఎవరికైనా పార్టీ సిద్దాంతాలు నచ్చకపోతే వారు వెళ్లిపోవచ్చని, కానీ ఇక్కడ ఉండి వారికి నచ్చిన సలహాలు చెప్పడం మానుకోవాలన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలు సోషల్ మీడియా, ఇంటర్వ్యూ లకే పరిమితం కావొద్దని, ప్రజా సమస్యలపై సీరియస్ గా పోరాడాలని సూచించారు. ఇక అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీపై పవన్ స్పందించారు, వారిద్దరి మధ్యా ఏం చర్చ జరిగిందో వారే చెప్పాలన్నారు. చంద్రబాబు-మోడీ అసలు కలిసే అవకాశం లేదని అందరూ అనుకున్నారని, కానీ ఇటీవల ఢిల్లీలో వారిద్దరూ కలుసుకున్నారని గుర్తు చేస్తూ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, పరిణామాలు మారుతుంటాయని అభిప్రాయపడ్డారు.
రాయలసీమకు పరిశ్రమలు రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని, అక్కడి వెనుకబాటు తనానికి వారే కారణమని ఆరోపించారు. అక్కడ పరిశ్రమలు పెట్టాలంటే వారికి కప్పం కట్టాలని, లేకపొతే దాడులు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమ యువత ఉపాధి కోసం బెంగుళూరు, హైదరాబాద్ వలస వెళుతున్నారని చెప్పారు. దేశం నుంచి ఎందరో పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నారని, సీమలో పెట్టుబడులు రానిదే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Also Read : పవన్ కు ప్యాకేజీ డీల్ కుదిరింది: దాడిశెట్టి