Friday, November 22, 2024
HomeTrending Newsనా అనుభవం - పవన్ పవర్ రెండూ కలిశాయి: చంద్రబాబు

నా అనుభవం – పవన్ పవర్ రెండూ కలిశాయి: చంద్రబాబు

శిథిలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే కూటమిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తనకు అనుభవం ఉందని, పవన్ కు పవర్ ఉందని, అగ్నికి వాయువు… ప్రజాగళానికి వారాహి తోడయ్యాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ సంకల్పానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, అలాంటి సహకారం ప్రధాని నరేంద్ర మోడీ నుంచి వస్తుందని అన్నారు. మూడు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నామని వైసీపీకి డిపాజిట్లు కూడా రావని విశ్వాసం వెలిబుచ్చారు. తణుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు.

బాబు మాట్లాడుతూ ‘ సైకిల్ స్పీడ్ కు తిరుగులేదు- గ్లాస్ జోరుకు ఎదురు లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో ప్రజల కోసం నిలబడ్డ పవన్ కళ్యాణ్ అసలైన హీరో అంటూ కొనియాడారు. ఈ ప్రభుత్వ అక్రమాలను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత దాడులను సైతం ఎదుర్కొని నిలబడ్డారన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేశారని, అప్పులపాలుజేశారని… యువత కన్నెర్ర జేస్తే జగన్ లండన్ పారిపోతారని హెచ్చరించారు. వైసీపీ కబంధ హస్తాలనుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపు ఇచ్చారు.

‘నా అక్షరాలు ప్రజా శక్తులు వహించే విజయ ఐరావతాలు – నా అక్షరాలు  వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలు’ అంటూ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితతో ప్రసంగం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్… ధాన్యానికి మొలకలు వచ్చాయంటూ మొరపెట్టుకున్న రైతులను ఏడిపించిన పౌరసరఫరాల శాఖ మంత్రి, ఆయన కొడుకు ఈ ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోవాలంటూ కారుమూరి నాగేశ్వర రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  చంద్రబాబు బలమైన, అనుభవం ఉన్న నాయకుడని.. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత అని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న గుండె ధైర్యం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు.

ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదని, మీకోసం మాట్లాడడానికి వచ్చామన్నారు. ప్రజల కోసం చంద్రబాబు కూడా కొంత తగ్గాల్సి వచ్చిందని… తణుకులో అసెంబ్లీ అభ్యర్ధిని ముందుగానే ప్రకటించి కూడా తాము వెనక్కు తగ్గామని…. అనకాపల్లిలో ఎంపి అభ్యర్ధిగా తన సోదరుడు నాగబాబును ప్రకటించి కూడా ఆ సీటు బిజెపి అడిగిందని కేటాయించి తన సోదరుడికి క్షమాపణ చెప్పానని వెల్లడించారు. ప్రజల భవిష్యత్తు కోసం మోడీ, చంద్రబాబులతో మాట్లాడి ఈ కూటమి ఏర్పాటు కోసం కృషి చేశానని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్