Monday, May 20, 2024
HomeTrending Newsపాలస్తీనా తుడిచిపెట్టుకు పోతుందా?

పాలస్తీనా తుడిచిపెట్టుకు పోతుందా?

పశ్చిమాసియాలో పిరంగుల మోతలు… ఆకలి చావులు గత ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పై 2023 అక్టోబర్ 7వ తేదిన హమాస్ ఉగ్రవాదులు దాడులకు దిగారు. అనేకమందిని హతమార్చి 253 మందిని బదీలుగా తీసుకెళ్ళారు. దీంతో శివాలెత్తిన యూదులు పాలస్తీనాలో మారణహోమం సృష్టిస్తున్నారు. ఆణువణువూ గాలిస్తూ హమాస్ ఉగ్రమూకలను తుదముట్టిస్తున్నారు. అమెరికా సహా ప్రపంచ దేశాలు కాల్పుల విరమణపై ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ఇజ్రాయెల్ ఖాతరు చేయటం లేదు.

హమాస్ చేసిన దారుణానికి తగిన రీతిలో బుద్ది చెపుతామని ప్రతిజ్ఞ బూనిన యూదులు అన్నట్టుగానే పాలస్తీనాను శవాల దిబ్బగా మార్చేస్తున్నారు. హమాస్ భవిష్యత్తులో ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూడకుండా… తమ దేశం మీద దాడి చేయటానికి శత్రు దేశాలు సాహసం చేయకుండా చేస్తామని ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ హెచ్చరికలు చేశారు.

అప్పట్లో ఇజ్రాయెల్ హెచ్చరికలను ప్రపంచ దేశాలు తేలిగ్గా తీసుకున్నా… యూదు సైన్యం అలుపు సొలుపు లేకుండా పాలస్తీనాలో హమాస్ టెర్రరిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. తాజాగా హమాస్ చెరలో ఉన్న బందీల్లో 40 మంది చనిపోయారని ఈ సంస్థ మొదటిసారిగా ప్రకటించింది.

ప్రతి యూదు పౌరుడు తమ దేశ భవిష్యత్తుగా భావించే ఇజ్రాయెల్ పాలకులు 40 మంది చనిపోయారనే వార్తతో ఆగ్రహోదగ్రులయ్యారు. హమాస్‌పై యుద్ధం ఆపేది లేదంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తెగేసి చెప్పా రు. దక్షిణ గాజా, రఫా సహా అన్ని చోట్ల హమాస్‌ బ్రిగేడ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమనెవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

రఫాపై దాడులు చేస్తే ఏకాకిగా మిగిలే ప్రమాదముందని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో నెతన్యాహు మాట్లాడుతూ ‘ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు. మా శత్రువు ఇటీవల చేసింది భవిష్యత్‌లో మళ్లీ చేయకుండా గట్టిగా బుద్ధి చెబుతాం’ అని ఆయన పునరుద్ఘాటించారు.

తుర్కీయే, ఇరాన్ దేశాలు ముస్లిం సమాజంలో పట్టు కోసం… ఇస్లాం పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మల్లిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సిరియా, ఇరాక్ ల్లో పురుడు పోసుకున్న ISIS (Islamic State of Iraq and Syria) క్రమంగా విస్తరిస్తోంది. సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్ తదితర దేశాల్లో వేల్లునుకున్న ఐసిసీస్(ISIS) హమాస్ ఉగ్రవాదులకు హిజ్బోల్లా ద్వారా దన్నుగా నిలిచిందని.. ఇరాన్ సాంకేతిక సహకారం అందించిందని ఆరోపణలు ఉన్నాయి.

తాజా పరిణామాలను పరిశీలిస్తే పాలస్తీనా భూభాగాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పనిలో ఇజ్రాయెల్ ఉన్నట్టుగా అవగతం అవుతోంది.  ఉగ్రవాదుల ఏరివేత కొనసాగిస్తూ పాలస్తీనా ప్రజలను ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళేలా చేశారు. భవిష్యత్తులో వారు తిరిగి రాకుండా ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

ఇవేవి పట్టనట్టుగా ముస్లిం దేశాలు ఈద్ వేడుకలకు సిద్దం అయ్యాయి. హమాస్ ను రెచ్చగొట్టిన దేశాలు, ఉగ్రవాద సంస్థలు పాలస్తీనా ప్రజలను పట్టించుకోవటం లేదు. రంజాన్ సంబరాలు చేసుకోలేక పాలస్తీనా ప్రజలు దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్