పేద ప్రజలపై ప్రేమతో, బాధ్యతతో 56 నెలల పాలనలో తాము అమలు చేస్తోన్న పథకాలే వచ్చే ఎన్నికల యుద్ధంలో తమ బాణాలు, అస్త్రాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ యుద్ధంలో 175 కి 175 సీట్లు తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ప్రతి వూరికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి ఇంటికి తాము చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అందరూ ఓడిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. భీమిలిలో ఓ వైపు సముద్రం కనిపిస్తుంటే… మరోవైపు జన సముద్రం కనబడుతోందన్నారు. భీమిలిలో ‘సిద్ధం’ పేరిట వైఎస్సార్సీపీ ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభ ద్వారా సిఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ జైత్ర యాత్రకు, మరో పాతికేళ్ళ తమ సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగింపుకు ఇది సన్నాహక సమావేశమని పేర్కొన్నారు.
“ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరిలో కురుక్షేత్ర యుద్దానికి సిద్ధమైన పాండవుల సైన్యం, సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తూ ఉంటే మరోవైపు కౌరవ సైన్యం ఉంది, దుష్ట చతుష్టయం ఉంది, గజదొంగల ముఠా ఉంది….. కానీ వారి పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఉన్నది అభిమన్యుడు కాదని, ఇక్కడ ఉన్నది అర్జునుడు… ఆ ఆర్జునిడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అక్కచెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు అందరూ” అని భావోద్వేగంతో ప్రకటించారు.
నేడు జరుగుతున్నది వైసీపీని భుజాన మోస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశమన్నారు. మేనిఫెస్టోలో చెప్పింది చేశాం కాబట్టే ప్రతి ఇంట్లో మీ బిడ్డగా తనను ఆదరిస్తున్నారని, వైసీపీని తమ పార్టీగా భావిస్తున్నారని అందుకే 75 ఏళ్ళ వయసు మళ్ళిన చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో లేదని, చివరకు 2019లో వచ్చిన సీట్లు కూడా రావనేదానికి, మొత్తం స్థానాల్లో పోటీ పెట్టేందుకు వారికి అభ్యర్ధులు కూడా లేరన్నదానికి ఇది నిదర్శనమని వివరించారు. “మనపార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ, మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయగాథ, మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు.. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీ” అంటూ కార్యకర్తలను ఉత్తేజితులను చేశారు.