సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఓ సానుకూల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఏనాడూ ఉద్యోగులపై సానుభూతి చూపని గత పాలకులు ఇప్పుడు వారిని రెచ్చగొట్టి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని, ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోలేకపోయామని, కోవిడ్ సమయంలో ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ గతంలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కు సంబంధించి కనీసం ఒక్క మాట కూడా రాయని, చూపని ఎల్లో పత్రికలు, మీడియా ఇప్పుడు రెచ్చగొట్టేలా వార్తలు ఇస్తున్నారని ఆరోపించారు.
విద్యకు పేదరికం అడ్డు రాకూడదన్నది తమ అభిమతమని, విద్యార్ధులను శిల్పాల్లా తీర్చి దిద్దేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఇవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేందుకు కాదని జగన్ స్పష్టం చేశారు.
విద్యారంగంలో ఈ మూడేళ్ళలో 53 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని స్పష్టం చేశారు. తాను ఇంతకాలంగా విద్యా శాఖపై చేసినన్ని సమీక్షలు మరే ఇతర శాఖపై చేయలేదన్నారు. విద్యారంగాల్లో తాము చేపట్టిన సంస్కరణలకు ఉపాధ్యాయుల తోడ్పాటు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేశారని, విద్య, వైద్యం, రవాణా రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారని, కానీ తాము ప్రభుత్వ రంగాలపై ప్రేమతో వీటిని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. విద్యారంగంలో మరిన్ని సంస్కరణలు చేపడతామని, వాటికి కూడా ఉపాధ్యాయులు అధ్యాపకులు కలిసి వస్తారని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
వృత్తిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సిఎం జగన్ మెడల్స్, ప్రశంశా పత్రాలతో సత్కరించారు. వీరిలో పాఠశాల విద్యా శాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, బాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయస్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ విద్యాలయ అవార్డులు సాధించిన 26 పాఠశాలలను కూడా ఈ పురస్కారాలకు ఎంపిక చేసి వారిని కూడా సన్మానించారు.